Venkatarami Reddy: నాడు కలెక్టర్.. నేడు మినిస్టర్?
Venkatarami Reddy: గులాబీ పార్టీలో అనూహ్య నిర్ణయాలు జరిగిపోతున్నాయి.
Venkatarami Reddy: గులాబీ పార్టీలో అనూహ్య నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఉద్యమ కాలం నుంచి పనిచేసిన నేతలకు పక్కన పెట్టి ఉద్యోగస్తులకు పెద్దపీట వేస్తున్నారు. అధినేత ఆశీర్వాదం ఉంటే చాలు పార్టీలో, ప్రభుత్వంలో చేరిపోవచ్చు. బాస్ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు టీఆర్ఎస్‌లో చర్చనీయాంశమైంది. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో కలెక్టర్ పదవికి రాజీనామా చేయించి, ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంపై పార్టీలో, ఉద్యోగ సంఘాల్లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో మాజీ కలెక్టర్‌కు అమాత్యయోగం కూడా దక్కబోతోందన్న ప్రచారం తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టేస్తోంది.
సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఆయనకు టీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ రాజకీయంగా మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చాకే ఉద్యోగానికి రిజైన్ చేసినట్లు తెలుస్తోంది. రాజీనామ చేసిన గంటల్లోనే కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. అక్కడి నుంచి అనుమతి రాగానే త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరుతానని వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. కానీ అలాంటి చేరిక ఏమీ లేకుండానే ఆ పార్టీ తరుపున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు కూడా చేశారు.
కలెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానాలు నచ్చి తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కొంతకాలం నుంచి వెంకట్రామిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారట. కొన్ని సందర్భాల్లో కలెక్టర్ హోదాలో ఆయన చేసిన కామెంట్లు, వ్యవహారశైలి రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి కూడా. దీంతో కలెక్టర్‌గా ఉన్నప్పుడే ప్రతిపక్షాలకు ఆయన టార్గెట్ అయ్యారు.
2014లో తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి పూర్వపు మెదక్ జిల్లాకు పోస్టింగ్ ఇచ్చిన కలెక్టర్ సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి పని చేసేలా వెంకట్రామిరెడ్డిని ఎంకరేజ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు, హరీష్‌రావుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈ మాజీ కలెక్టర్ 2018 ఎన్నికల సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. సిద్దిపేట కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఏరికోరి వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా నియమించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన మిస్టర్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం 50 వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించడంలో యంత్రాంగానికి నాయకత్వం వహించారు. గజ్వేల్ సమీపంలో ఆరు వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఆయన విజయవంతం చేశారు. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా వెంకట్రామిరెడ్డే అని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడం వారిద్దరి మధ్య సన్నిహిత్యానికి నిదర్శనం అనే చర్చ అప్పట్లో జరిగింది.
అయితే కొన్ని సందర్భాల్లో వెంకట్రామిరెడ్డి వ్యవహారం వివాదాస్పదం అయింది. ఒకానొక సమయంలో సిద్దిపేట కలెక్టరేట్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం పెద్ద దుమారమే రేపింది. ఒక అధికారిగా ఉండి కాళ్లు మొక్కడమెంటని ప్రతిపక్షాలు ఆయనపై విరుచుకుపడ్డాయి. ఇక తాజాగా వరి విత్తనాలు అమ్మొద్దని సీడ్ వ్యాపారులను హెచ్చరించడంపైనా వివాదం చెలరేగింది. ప్రభుత్వ విధానం మేరకే ఆయన వరిపై మాట్లాడారని అప్పట్లో విపక్షాలు కోడై కూశాయి. ఇంకో విషయం ఏంటంటే వెంకట్రామిరెడ్డికి ఎప్పటినుంచో రాజకీయాలపై ఆసక్తి ఉందట. పలు సందర్భాలలో తాను రాజకీయాల్లోకి వస్తానంటూ కేసీఆర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నిక సమయంలో అక్కడ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి ని నిలబెడతారనే చర్చ కూడా జరిగింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
ఇక, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఆయనకు కేసీఆర్ జిల్లా నుంచి నిన్నటి వరకు చర్చలో ఉన్న ఎర్రొళ్ల శ్రీనివాస్ పేరును పక్కన పెట్టీ మరీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా వెంకట్రామిరెడ్డికి ఆఫర్ ఇచ్చారు. మరోవైపు త్వరలో జరిగే మంత్రివర్గ పునఃవ్వవస్థీరకణలో వెంకట్రామిరెడ్డికి మంత్రిగా కూడా అవకాశం రావచ్చనే చర్చ జరుగుతోంది. రెవెన్యూ శాఖను ఆయనకే కట్టబెడుతారని అంటున్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నేతలు ఇప్పటికే వెంకట్రామిరెడ్డి వ్యవహారంలో గట్టి ఆరోపణలు చేస్తున్నారు. వారి కుటుంబానికి చెందిన రాజపుష్ప సంస్థ పేరుతో అక్రమాలు చేశారని విమర్శిస్తున్నారు. కేసీఆర్ బినామీ అంటూ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ తిడుతున్నారు. అలాంటి వెంకట్రామిరెడ్డిని ఏరికోరి తన ప్రభుత్వంలోకి తీసుకుంటున్న కేసీఆర్, ఆయనకు కీలక పదవి కట్ట బెడుతారనే చర్చ ఇప్పుడు స్టేట్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.