Uttam Kumar Reddy : రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy : ప్రజల సమస్యలపై కాంగ్రెస్ నాయకులు క్షేత్ర స్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్దేశించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు ఏ వ్యాఖ్యలు చేసినా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. వారు ప్రతిపక్షాన్ని అణచి వేస్తున్నారని విమర్శించారు. ''భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే. నేను మీకు నిరంతరం అండగా అందుబాటులో ఉంటాను. పార్టీని మరింత బలోపేతం చేద్దాం.'' అని ఉత్తమ్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అంశాల వారీగా ప్రభుత్వంపై పోరాటాలు చేయాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పటిష్ఠంగా ఉందంటే అందుకు కారణం జిల్లా కాంగ్రెస్ కమిటీలేనని అన్నారు. గత ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు బలంగా వ్యతిరేకిస్తున్నాయని ఉత్తమ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఉత్తమ్ అన్నారు. ప్రజలంతా వాళ్లంతా కాంగ్రెస్ వైపే వస్తున్నారని, వచ్చే ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షులు జిల్లాల్లో చాలా కష్టపడి పని చేస్తున్నారని కొనియాడారు. 2014, 18 ఎన్నికలలో ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, కేసీఆర్ పాలనపై ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందని చెప్పారు. నేటికి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయని అన్నారు.