రేషన్ బియ్యంలో యూరియా కలుపుతున్న కేటుగాళ్లు

Update: 2020-10-10 10:30 GMT

కాలే కడుపులు నింపే పథకం ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టే చద్దిమూట అలాంటి పోషకాహారాన్ని అందించాల్సిన బియ్యం పంపిణీ పేదల ప్రాణాలు మింగేలా మారుతోంది. తెల్లటి బియ్యం మాటున యూరియా కలిపి పేదలకు పంపిణీ చేస్తున్నారు. బియ్యంలో యూరియా కలుపుతుందెవరు..? పేదల బియ్యంలో విషాన్ని ఎందుకు కలుపుతున్నారు..? ఆదిలాబాద్ జిల్లా బియ్యంలో యూరియా దందా పై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.

రేషన్ బియ్యం గిరిజనుల ఆకలిని తీర్చుతోంది అలాంటి పోషకాహారం విష ఆహారంగా మారుతోంది. సర్కార్ పంపిణీ చేస్తున్నబియ్యంలో యూరియా కలిపి పేదలకు ఇస్తున్నారు. ఆదిలాబాద్ ఇంద్రవెల్లి మండలంలో మార్కగూడ గ్రామానికి చెందిన గిరిజనులు ప్రతినెల మాదిరిగా ఈ నెల రూపాయి కిలో బియ్యాన్ని రేషన్ దుకాణం నుంచి తెచ్చుకున్నారు. అయితే రేషన్ డీలర్ పంపిణీ చేసిన బియ్యంలో యూరియా కలిపి ఉంది. తెల్లటి బియ్యంలో యూరియాను చూసిన గిరిజనులు నిర్ఘాంతపోయారు. గూడెంలో రేషన్ దుకాణంలో తెచ్చుకున్న అందిరికి యూరియా కలిపిన బియ్యమే వచ్చాయి. ఆ బియ్యాన్ని ఎప్పటిలాగానే కొందరు వండుకోని తిన్నారు. దాంతో కొందరికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. చిన్న పిల్లలు అస్వస్థతకు గురయ్యారని గిరిజనులు అవేదన వ్యక్తం చేశారు.

అయితే యూరియా కలిపిన బియ్యాన్ని పంపిణీ పై హెచ్ఎంటీవీ ప్రతినిధి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బియ్యం పంపిణీ చేసిన రేషన్ దుకాణాన్ని స్థానిక ఎమ్మర్వో పరిశీలించారు. యూరియా కలిపిన బియ్యం శాంపిల్స్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా బియ్యం పంపిణీ చేసిన కంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఎజెన్సీ ప్రాంతంలో పేదల బియ్యం పంపిణీలో చీకటి దందసాగుతుంది. పేదలకు అందాల్సిన బియ్యంలో కొంతమంది కేటుగాళ్లు యూరియా కలిపి క్యాష్ చేసుకుంటారు. తమకు విషం కలిపిన బియ్యాన్ని పంపిణీ చేస్తారా అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

Tags:    

Similar News