Swachh Survekshan 2020 : కేంద్ర ప్రభుత్వం పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన 'స్వచ్ఛ సర్వేక్షణ్-2020' ఫలితాలను ప్రకటించింది. కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ ఈ సర్వే ఫలితాలను గురువారం విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 4,242 పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డుల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. 10 లక్షలకు పైబడిన నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం వరుసగా నాలుగో సారి ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాలకు విషయానికొస్తే విజయవాడకు-4వ ర్యాంక్ వచ్చింది. విశాఖ 9వ ర్యాంకు సాధించగా, హైదరాబాద్ 23 స్థానంలో నిలిచింది. ఇక పోతే రెండో, మూడో ర్యాంకులను సూరత్, నవీ ముంబయి దక్కించుకున్నాయి.
మొత్తం 4242 నగరాల్లో 28 రోజుల పాటు సర్వే చేపట్టారు. సర్వేలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి 24లక్షలకు పైగా ఫొటోలను జియోట్యాగ్ చేశారు. ఇక ఇదే విధంగా లక్ష నుంచి 10 లక్షలు జనాభా కలిగిన పట్టణాల జాబితా విషయానికొస్తే ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ తొలి స్థానంలో నిలిచింది. రెండు మూడు స్థానాల్లో మైసూర్, న్యూదిల్లీ (ఎన్‌డీఎంసీ) నిలిచాయి. ఇక ఈ క్యాటగిరిలో తెలుగు రాష్ట్రాల విషయానికోస్తే తిరుపతి 6వ ర్యాంకు సాధించగా రాజమహేంద్రవరం 51 స్థానంలో నిలిచింది. ఇక మిగిలిన నగరాల్లో ఒంగోలు 57, కాకినాడ 58, కరీంనగర్ 72, తెనాలి 75, కడప 76, చిత్తూరు 81, తాడిపత్రి 99వ ర్యాంకుల్లో నిలిచాయి. స్వచ్ఛతపై ప్రపంచంలోనే అతి పెద్ద సర్వే ఇదేనని అధికారులు తెలిపారు.
విజయవాడకు పురస్కారం దక్కడంపై గురువారం నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. 1.9కోట్ల మంది పౌరుల నుంచి ఫీడ్ బ్యాక్‌ను సేకరించారు. ప్రజల అందరి సహాయ సహకారాలతో ఈ అవార్డ్ సాధించామని ఆయన అన్నారు. నగరానికి కొత్త ప్రాజెక్ట్ విషయాలపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చించినప్పుడు మంత్రి పూర్తి సహకారం అందించారు. ''సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ సర్వే నాలుగో స్థానంలో నిలవడం చాలా ఆనందం. తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా ఏర్పాటు చేశాము. నగరంలో గత సంవత్సరం నుంచి ప్లాస్టిక్ నిషేధించడాన్ని ప్రజలు ఆదరించారు. దానికి కూడా ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది.