టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతిపై మళ్లీ దృష్టి సారించింది. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో ఈ పథకం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో దాదాపు 20 లక్షలమంది నిరుద్యోగులు ఉంటారు. ఒక్కొక్కరికి 3,016 రూపాయల చొప్పున భృతి ఇస్తే ఏటా 4వేల 800 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. అయితే, నిరుద్యోగ భృతి కోసం ఏ విద్యార్హతాలను పరిగణలోకి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగులకు 3వేల 16 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 2019 బడ్జెట్‌లో 1,810 కోట్లు సైతం ప్రభుత్వం కేటాయించింది. తర్వాత ఆర్థిక ప్రతికూలతలతో ఈ పథకాన్ని అమలు చేయలేదు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో యువతను తమ వైపు తిప్పుకోవడానికి నిరుద్యోగ భృతి హామీని మళ్లీ సర్కార్ తెరపైకి తెచ్చింది. త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
మంత్రి కేటీ ఆర్ వ్యాఖ్యలతో నిరుద్యోగ భృతి మరోసారి రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ పథకం విధివిధానాలపై అధికారులు దృష్టి పెట్టారు. నిరుద్యోగులను ఏ దశ నుంచి పరిగణణలోకి తీసుకోవాలనే అనే అంశంపై కసరత్తు చేస్తున్నారు.
ఉపాధి కల్పన శాఖలో పేర్లను నమోదు చేసుకున్న వారిలో పదోతరగతి మాత్రమే పాసైన వారు కూడా ఎక్కువగా ఉన్నారు. నిరుద్యోగ భృతి పథకం కింద ఇంటర్ లేదా డిగ్రీని ప్రాతిపదికగా తీసుకుంటారా ? పీజీని పరిగణలోకి తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 20 లక్షలమంది నిరుద్యోగులు ఉంటారని, వీరికి 3,016 రూపాయల చొప్పున ఇస్తే ఏటా 4,800 కోట్ల వరకు ఖర్చవుతుందని ఆర్థికశాఖ వర్గాలు అంచనావేస్తున్నాయి.
నిరుద్యోగులుగా నమోదు చేసుకున్న వారు ఉద్యోగాలు వచ్చాక ఉపాధి కల్పన కార్యాలయాల్లో తమ పేరును తొలగించుకోవడంలేదు. కొన్ని రాష్ట్రాల్లో పీఎఫ్‌లు, ఈపీఎఫ్‌లు, ఈఎస్‌ఐ, బ్యాంకు వేతన ఖాతాల ద్వారా ఉద్యోగులను గుర్తిస్తున్నారు. ఆధార్‌లోనూ ఉద్యోగితను నమోదు చేయడం ద్వారా నిరుద్యోగుల గుర్తింపునకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.నిరుద్యోగ భృతి అమల్లో ఉన్న, గతంలో అమలు చేసిన పశ్చిమబెంగాల్, కేరళ తదితర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.