గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. భారీగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని అన్ని కాలనీలు జలమయం అయి జన జీవనం అతలాకుతలమైంది. భారీగా వరద నీరు రోడ్డుపై రావడంతో నగరంలో ట్రాఫిక్ పూర్తిస్థాయిలో నిలిచిపోయింది. నగరంలో ఉన్న పెద్ద పెద్ద హోర్డింగులు కూలిపోగా వాహనాలు కొట్టుకుపోయాయి, అంతే కాక కొన్ని వందల చెట్లు నెలకొరిగాయి. అయితే నగరంలో ఈ రోజు వర్షం ఎక్కువగా లేకపోవడంతో ఇప్పడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి.
కాస్త వరదలు తగ్గుముఖం పట్టండంతో అబ్దుల్లాపూర్ మెట్టు మండలం ఇంజపూర్ వాగులో గురువారం ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ఇద్దరు యువకులను తోరూరు గ్రామానికి చెందిన ప్రణయ్(19), ప్రదీప్ (16)లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తోరూరు గ్రామం నుంచి ఇంజపూర్‌కు మంగళవారం సాయంత్రం పానీపూరి తినడానికి వెళుతుండగా ప్రణయ్, ప్రదీప్ వాగులో గల్లంతయ్యారు. అయితే ఈరోజు కాస్త వరదలు తగ్గుముఖం పట్టడంతో మృతదేహాల ఆచూకీ లభ్యమయింది. దీంతో స్థానికుల సహాయంతో మృతదేహాలను వేలికితీసిన పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఇదిలా ఉంటే నాగోల్ బండ్లగూడా మల్లికార్జున నగర్‌లో కూడా ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. నగరంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరదలు ఎక్కువగా రావడంతో పోస్ట్ మాన్ సుందర్ రాజు కొట్టుకుపోయాడు. దురదృష్టవశాత్తు 48 గంటలు తర్వాత సందర్ శవమై తేలడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. విధులు ముగించుకుని బండ్లగూడా మల్లికార్జున నగర్‌లోని ఇంటికి సైకిల్‌పై వెళుతుండగా నీళ్లలో పడిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.