Investment Crimes: సోషల్ మీడియాలో యాడ్ చూసి కాల్.. కట్ చేస్తే రూ. 75 లక్షలు కొట్టేశారు

Update: 2024-09-15 08:05 GMT

NRI Duped by Fraudsters: తమ వ్యాపారంలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడు లక్షలు వస్తాయన్నారు. కోటి రూపాయలు పెడితే 3 కోట్లు వస్తాయన్నారు. 300 శాతం లాభాలు గ్యారెంటీ అని నమ్మించారు. అది కూడా కేవలం ఏడాది లోపే మీ లాభాలు మీకు వచ్చేస్తాయని చెప్పడంతో వారి మాటలు నమ్మిన ఓ ఎన్నారై తాను విదేశాల్లో కష్టపడి సంపాదించిన సొమ్మును ఇండియాకు పంపించారు.

అలా ఇద్దరు వ్యక్తులు ఆ ఎన్నారై నుండి పెట్టుబడి పేరుతో దఫాల వారీగా రూ. 75 లక్షలు వరకు కాజేశారు. అయితే, ఒకానొక దశలో వీళ్ల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన సదరు ఎన్నారై వారి పూర్తి వివరాలు ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. ఆ ఇద్దరు వ్యక్తుల వ్యాపారం, దుకాణం ఎప్పుడో మూతపడింది కానీ ఇప్పటికీ వాళ్లు తమ పాత వ్యాపారం పేరు చెప్పుకునే ఇంకా జనం నుండి డబ్బు లాగి వారిని మోసం చేస్తున్నారని తెలుసుకున్న బాధితురాలు నిన్న శనివారమే హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలు మోసం ఎలా జరిగిందంటే..

విదేశాల్లో ఉన్న బాధితురాలు సోషల్ మీడియాలో బ్రౌజ్ చేస్తుండగా ఆమెకు ఒక అడ్వర్టైజ్ మెంట్ కనిపించింది. సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టేందుకు ఫైనాన్షియర్ కావలెను అనేది ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన చూసి టెంప్ట్ అయిన ఎన్నారై.. వారు చెప్పిన నెంబర్లలో సంప్రదించారు. అక్కడి నుండి వారి మోసం మొదలైంది.

తాను పెట్టుబడి పెట్టే సినిమా కథాంశం హిందూవాదం, సనాతన ధర్మం సంప్రదాయాలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని ఆమె వారికి షరతులు పెట్టారు. వీడియో కాల్స్ ద్వారానే ఈ మాట ముచ్చట అంతా అయిపోయింది. అందుకు ఆ ఇద్దరు వ్యక్తులు స్పందిస్తూ.. తమ సినిమా ఎలా ఉంటుందంటే, కేవలం ఓటీటీల్లోనే కాదు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టీవీ ఛానెల్స్ సైతం తమ మూవీని ప్రదర్శించేలా సినిమా ఉంటుందని నమ్మించారు. అందుకోసం కనీసం రూ. 25 లక్షలు పెట్టుబడి కావాలని అడగడంతో ఆమె అలాగే ఇచ్చేశారు.

ఆయిల్, గ్యాస్ బావుల పేరుతో మరో మోసం

కేంద్ర ప్రభుత్వం ఆయిల్, గ్యాస్ బావుల కోసం టెండర్స్ ఆహ్వానిస్తోందని, ఆ బిడ్డింగ్ లో పాల్గొనాలంటే కనీసం రూ. 3 కోట్లు కావాలని నమ్మించారు. ఈ వ్యాపారంలో పెట్టుబడిపెడితే లాభాలే లాభాలు అని అదే ఎన్నారైని మరోసారి బోల్తా కొట్టించారు. రెండోసారి కూడా వారి మాటలు నమ్మిన ఎన్నారై.. మరోసారి . రూయ 50 లక్షలు పెట్టుబడి కోసం ఇచ్చేశారు. ఒకవేళ ఆ కాంట్రాక్ట్ దక్కించుకోలేని పక్షంలో ఆ రూ. 50 లక్షలు తిరిగి ఇచ్చేయాలని వారితో అగ్రిమెంట్ రాయించుకున్నారు.

సీన్ కట్ చేస్తే... ఆ కాంట్రాక్ట్ వారికి రాలేదు అని తెలుసుకున్న ఎన్నారై, తన డబ్బు తనకి తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు. వారు లైట్ తీసుకుంటున్న విధానం చూసి మరింత లోతుగా వివరాలు సేకరించగా.. అసలు వీళ్లు ప్రభుత్వం ఆహ్వానించిన బిడ్డింగ్ లో పాల్గొనకుండా తనని మోసం చేశారు అని అర్థమైంది. అంతేకాదు.. 2019 లోనే వీళ్లు తమ దుకాణం మూసేసినప్పటికీ ఇంకా ఇలా వ్యాపారం, పెట్టుబడులు పేరుతో జనం నుండి డబ్బులు గుంజుతున్నారని ఎన్నారై గ్రహించారు. దీంతో తన డబ్బులు తనకు కావాలని ఈసారి ఇంకాస్త గట్టిగా డిమాండ్ చేశారు.

బాధితురాలు నుండి ఒత్తిడి తీవ్రం అవడంతో ఈ ఇద్దరు వ్యక్తులు కూడా తమ అసలు రంగు బయటపెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇండియాకు తిరిగివస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. దీంతో ఇక చేసేదేం లేక బాధితురాలు ఆ ఇద్దరిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులకు డబ్బులు చెల్లించినట్లుగా తమ వద్ద ఉన్న మనీ ట్రాన్‌ఫర్ ఆధారాలను పోలీసులకు అందించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరిపై సెక్షన్ 120 బి (కుట్రపూరిత కోణం) సెక్షన్ 420 (చీటింగ్), సెక్షన్ 406 (నమ్మక ద్రోహం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ తరహాలో వీళ్లు చాలామంది నుండి భారీ మొత్తంలో డబ్బు లాగి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Tags:    

Similar News