Breaking News: తెలంగాణలో ఒమిక్రాన్ ఎంట్రీ.. రెండు కేసులు నమోదు
Breaking News: తెలంగాణలో ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చేసింది.
Breaking News: తెలంగాణలో తొలిసారిగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా, సోమాలియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను సీసీఎంబీ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్ కేసుల వివరాలను డీహెచ్ వివరించారు.
12వ తేదీ కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారని ఆమెకు నిర్వహించిన జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్‌లో ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు డీహెచ్ తెలిపారు. హైదరాబాద్ టోలిచౌకిలో ఆమెను గుర్తించి గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. బాధిత మహిళకు సన్నిహితంగా ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యుల శాంపిల్స్ కూడా సేకరించినట్లు తెలిపారు. కెన్యా మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23ఏళ్ల వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకినట్లు డీహెచ్ వెల్లడించారు. అతడిని గుర్తించాల్సి ఉందన్నారు.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన మూడో వ్యక్తికి ఒమిక్రాన్ సోకిందని అతను రాష్ట్రంలోకి రాలేదని ఎయిర్ పోర్టు నుంచి నేరుగా పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయాడని డీహెచ్ చెప్పారు. అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు ఉన్నారని డీహెచ్ వివరించారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి టెస్ట్ లను పెంచుతామని డీహెచ్ చెప్పారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఒమిక్రాన్ వచ్చిన వారు పారిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని వివరించారు. ఒమిక్రాన్ సైతం గాలి ద్వారా సోకుతుందని తెలిపారు. రాష్ట్రంలో 4.19 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేశామని 97శాతం మందికి మొదటి డోస్ పూర్తి అయిందని డీహెచ్ వివరించారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.