ఆర్టీసీ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్న ట్విట్టర్
Twitter: ఏ సమస్య తీరాలన్నా ఇప్పుడు ట్విట్టరే ఆయుధంగా మారింది.
Twitter: ఏ సమస్య తీరాలన్నా ఇప్పుడు ట్విట్టరే ఆయుధంగా మారింది. ఒక సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నా ప్రజా ప్రతినిధులు దాన్ని పరిష్కరించాలన్నా సోషల్ మీడియానే వేదికైంది. అలాంటి సోషల్ మీడియా ఆ సంస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంతకీ ఏంటా సంస్థ... ఏమా సమస్యలు.
సోషల్ మీడియా ద్వారా త్వరితగతిన సమస్యలు పరిష్కారమవుతున్నాయనడంలో సందేహం లేదు. ఒక్కప్పుడు అధికారుల చుట్టూ తిరిగే జనం ఇప్పుడు సమస్యల పరిష్కారానికై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్ ద్వారా సమస్యలను పరిష్కరించడంలో మంత్రి కేటీఆర్ తనకంటూ ప్రత్యేకమైన చోటు సంపాదించుకున్నారు. ఇప్పుడు కష్టాలు, నష్టాల ఊబిలో కూరుకుపోయిన టీఎస్ ఆర్టీసీ సమస్యల పరిష్కారంలో ట్విట్టర్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఆర్థిక కష్టాల నుంచి టీఎస్ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పలు సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇన్నాళ్లు ఆర్టీసీలో సమస్యలను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తెలియని ప్రజానీకం ఇప్పుడు డైరెక్ట్‌గా సజ్జనార్‌కు ట్వీట్ చేస్తున్నారు. ప్రయాణీకుడు సమస్యలపై ట్విట్ చేయగానే వెంటనే స్పందించేలా బస్ భవన్‌లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అఫీషియల్ ఖాతాలో వచ్చిన కొన్ని వందల సమస్యలకు పరిష్కారం చూపించారు.
అటు సమస్యల పరిష్కారమే కాదు ప్రజా రవాణా విలువలతో కూడిన రవాణాగా ఉండాలని భావించారు సజ్జనార్. అందుకోసం బస్సులపై ఉన్న ప్రకటనలను నిషేధించారు. అసభ్యకరమైన యాడ్స్ బస్సు లోపల, బయట వేయవద్దని హెచ్చరించారు. పోస్ట్ చేస్తే క్రిమినల్ కేసులతో పాటు జరిమానా విధిస్తామన్నారు.
గతంలో సమస్యల పరిష్కారానికి బస్సుల్లో కంప్లైంట్ బాక్స్‌లు ఉండేవి. అందులో రాసి వేసిన సమస్యలు పరిష్కారమయ్యేదో లేదో తెలియదు కాని ఇప్పుడు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్న పలు సమస్యలకు అధికారులు పరిష్కారం చూపుతున్నారు.