సంక్రాంతి ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్.. అదనపు చార్జీలు లేకుండానే..
Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో పండుగలు సాధారణంగా ఆర్టీసీలకి కాసుల పంట పండిస్తోంది.
Sankranti Festival: తెలుగు రాష్ట్రాల్లో పండుగలు సాధారణంగా ఆర్టీసీలకి కాసుల పంట పండిస్తోంది. కానీ టీఎస్ ఆర్టీసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ సంక్రాంతి పండుగకు అదనపు బాదుడు లేకుండానే రెండు రాష్ట్రాలకు బస్సులు నడిపించేందుకు ఎండీ సజ్జనార్ సన్నద్ధమవుతున్నారు. పండుగ సీజన్‌లో టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన కొత్త విధానాలపై హెచ్ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్.
పండుగ ఏదైనా ప్రయాణీకుడి ముక్కు పిండి ఖజానా నింపుకోవడమే ఆర్టీసీల పని. అలాంటిది విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుంది టీఎస్ ఆర్టీసీ. సంస్థను గాడిలో పెడుతున్న ఎండీ సజ్జనార్ బస్సు ప్రయాణం ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మార్పులు, చేర్పులు చేస్తున్నారు. సంస్థలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంక్రాంతికి సాధారణ చార్జీలతో సగటు ప్రయాణీకుడిని ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అందులో భాగంగానే ఈ సంక్రాంతి పండుగ వేల టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో సాధారణ చార్జీలతో సురక్షిత ప్రయాణం చేయండంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ప్రముఖ నటుల సంభాషణతో పోస్టులు పెట్టింది. పండుగలకు ఇంటికెళ్లె వారంతా తెలంగాణ ఆర్టీసీలో టికెట్లు బుక్ చేసుకోండి డబ్బులను ఆదా చేసుకోండనే కొటేషన్లతో ట్రావెలర్స్‌కు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్‌గా మారాయి.
పండగల వేల బస్సుల విషయంలో ఎండీ సజ్జనార్ తీసుకున్న నిర్ణయం హర్షించ తగిందని యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా ప్రయివేటు వైపు వెళ్లే ప్రయాణీకులను ఆర్టీసీ వైపు మళ్లించవచ్చని అంటున్నారు. దీంతో పాటు ప్రయివేటు వాహనాల దోపిడీని అరికట్టాలని కోరారు. సామన్యులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్న టీఎస్ ఆర్టీసీ ప్లాన్ ఎంతవరకూ వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి !