TSRTC: పీఆర్సీ కోసం ఎదురుచూపులు చూస్తోన్న ఆర్టీసీ ఉద్యోగులు
TSRTC: ఆర్టీసీని ప్రభుత్వం పక్కనబెట్టడంతో నిరాశకు గురవుతున్నారు. తమకు కూడా ఫిట్‌మెంట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకూ పెరుగుతాయనుకున్నా.. ఆర్టీసీని ప్రభుత్వం పక్కనబెట్టడంతో నిరాశకు గురవుతున్నారు. తమకు కూడా ఫిట్‌మెంట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేనెల నుంచి పీఆర్సీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో తమకు కూడా ఫిట్మెంట్ కల్పించాలంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. 2020 డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయని అసెంబ్లీలో ప్రకటించారు. దాంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటే వేతన సవరణ జరుగుతుందని భావించారు. అయితే కేబినెట్ మీటింగ్‌లో తమ ప్రస్తావన రాకపోవడంతో మండిపడుతున్నారు ఆర్టీసీ కార్మికులు.
2017 ఏప్రిల్ 1 నుంచే ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నా అప్పుడు ఇవ్వలేదు. దాంతో 2019లో 25 డిమాండ్లతో 55 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేశారు. ఆ సమయంలో అన్ని డిమాండ్లు నెరవేరుస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వగా.. ఇప్పటివరకు వేతన సవరణ జరగలేదు. 2021 ఏప్రిల్ నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు రెండో పీఆర్సీ కూడా అమలవ్వాల్సి ఉంది. అది కూడా ప్రారంభం కాకపోవడంతో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రోజుకు 16 గంటలు పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచకుండా మొండిచేయి చూపించడం సరైన పద్ధతి కాదంటున్నారు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ నేతలు. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి రావాల్సిన డీఏలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటున్నారు.