నిరుద్యోగులకు టి.ఎస్.ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారికి 20శాతం రాయితీ కల్పిస్తూ...
TSRTC: *ఆధార్ కార్డు, కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు జత చేయాలి *ఆరు నెలల పాటు అందుబాటులో ప్రత్యేక ఆఫర్
TSRTC: ప్రజా రవాణా వ్యవస్థలో అతి పెద్ద సంస్థగా పేరుగాంచిన టి.ఎస్.ఆర్.టి.సి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సంస్థ అభివృద్ధి దిశగా ఆలోచిస్తూనే సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలకు శ్రీకారం చుడుతూ తనదైన ముద్ర వేసుకుంటోంది. పండగలు, జాతరలో ప్రత్యేక రోజుల్లో ప్రజలకు ఆర్టీసీ టిక్కెట్ ఆఫర్లు ప్రకటిస్తుంది.ఇక సంస్థ మరో సారి కీలక నిర్ణయంతో ముందుకొచ్చింది.ఈసారి నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆర్టీసీ.
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం శుభవార్తను అందించింది ఆర్టీసీ. 20 శాతం రాయితీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఆర్టీసీ అధికారులు. ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ ప్రకటించి ప్రజలకు మరింత చేరువైన సంస్థ మరోసారి ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టి.ఎస్.ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎం.డి వి.సి.సజ్జనార్ పేద అభ్యర్థులకు చేయూతను అందించాలనే ఉద్ధేశంతో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్‌లపై మూడు నెలలకు 20 శాతం రాయితీని ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రత్యేక ఆఫర్ మూడు నెలల పాటు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బస్ పాస్ పొందడానికి దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్ కార్డుతో పాటు కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన నిరుద్యోగ గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రస్తుత బస్ చార్జీలు సిటీ ఆర్డినరీ 3,450రూపాయలు, ఎక్స్‌ప్రెస్ 3,900 రూపాయలు వరకు ఉండగా పోటీ అభ్యర్థులకు 20 శాతం రాయితీ కల్పించడంతో ఆర్డినరీ 2800 రూపాయలు, ఎక్స్ ప్రెస్3200 రూపాయల ఛార్జీలు ఉంటాయిని అధికారులు స్పష్టం చేశారు. కోచింగ్ తరగతులకు హాజరవుతున్న నిరుద్యోగులకు ఈ ఆఫర్ 6 నెలల పాటు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.అన్ని బస్ పాస్ కౌంటర్లలోనూ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు.