Telangana: మహాలక్ష్మి పథకానికి భారీ స్పందన.. ఇప్పటివరకూ రూ. 9. 75 కోట్లు జీరో టికెట్లు జారీ
Telangana: ఉచిత ప్రయాణానికి భారీగా వినియోగించుకున్న మహిళలు
Telangana: తెలంగాణ వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి భారీ స్పందన లభించిది. డిసెంబర్ 11న మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస ప్రభుత్వం ప్రారంభించింది. కేవలం 45 రోజుల వ్యవధిలోనే జీరో టికెట్ జారీ ప్రక్రియ ఊహించనంత స్థాయిలో 9.75 కోట్లకు చేరింది. కేవలం 45 రోజుల వ్యవధిలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని దాదాపు 10 కోట్లమంది మహిళలు వినియోగించుకున్నారు. 9.75 కోట్ల జీరో టికెట్ల రూపంలో మహిళా ప్రయాణికులకు రూ.550 కోట్ల మేర ఆదా అయినట్టు తెలిసింది.
అంతమేర ఆదాయం ఆర్టీసీ కోల్పోయినందున, ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య సగటున నిత్యం 10 లక్షల కంటే ఎక్కువ మేర పెరిగింది.
కానీ, ఆ తాకిడిని తట్టుకునే సంఖ్యలో ఆర్టీసీ వద్ద బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలు ప్రాంతాలనుంచి వినిపిస్తోన్న వాదన. కొత్త బస్సులు కొంటున్నామని ఆర్టీసీ చెబుతున్నా, కొన్ని నామమాత్రంగానే వచ్చాయి. ఇప్పటికిప్పుడు కనీసం 4 వేల బస్సులు అవసరమన్న అభిప్రాయాన్ని ఆర్టీసీనే వ్యక్తం చేస్తోంది. కానీ, వాటిని కొనేందుకు అవసరమైన నిధులు సంస్థ వద్ద లేనందున, ప్రభుత్వమే సాయం చేయాల్సి ఉంది.
సరిపోను బస్సులు లేక జనం పడుతున్న ఇబ్బందులు ఎలా ఉన్నా, ఈ పథకం విజయవంతమైందన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. విజయోత్సవం తరహాలో ఓ కార్యాక్రమం నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. వీలైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని యంత్రాంగం భావిస్తున్నట్టు తెలుస్తుంది.