రేపటి నుండి తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. పకడ్బందీ ఏర్పాట్లు...
TS Tenth Exams 2022: హాజరుకానున్న విద్యార్థులు 5,09,275 మంది...
TS Tenth Exams 2022: తెలంగాణ పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు విద్య శాఖ మంత్రి. పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని మంత్రి సబితా సూచించారు. మే 23 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి.
పదవ తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,09,275 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. దాదాపు 2,861 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యల పరిష్కారానికి వీలుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఎఎన్ఎం, ఒక ఆశా ఉద్యోగిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు, తాగు నీరు అందుబాటులో ఉంచనున్నారు.
పదో తరగతి పరీక్షలకు బెంచీకొకరు చొప్పున విద్యార్థులను 'Z' ఆకారంలో కూర్చోబెట్టనున్నారు. ఒక్కో పరీక్ష కేంద్రంలోని తరగతి గదికి 12 నుంచి 24 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్న గదులైతే 12 మంది.. పెద్ద గదుల్లోనైతే 24 మంది కూర్చునేలా బెంచీలు వేస్తున్నారు. మండుటెండల్లో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. కేంద్రాల ఎంపికలో కరెంట్ సదుపాయాలు, తాగునీటి సౌకర్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరించారు.
గత ఏడాది 11 పేపర్లు మాత్రమే ఉండగా ఈ ఏడాది ఆరు పేపర్లకు కుదించడంతో విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కల్పించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. కొవిడ్ నిబంధ నలను సైతం పాటిస్తూనే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలని అధికారులు సూచించారు. 9.35నిమిషాల తరువాత విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.