నిరసన సెగ.. మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై కుర్చీలు, వాటర్ బాటిళ్లతో దాడి...

Malla Reddy: *రణరంగంగా మారిన రెడ్ల సింహగర్జన *మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న సభికులు

Update: 2022-05-30 03:49 GMT

నిరసన సెగ.. మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్ పై కుర్చీలు, వాటర్ బాటిళ్లతో దాడి...

Malla Reddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఊహించని రీతిలో నిరసన సెగ తగిలింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో నిర్వహించిన రెడ్డి సింహగర్జన బహిరంగ సభలో రెడ్ల ఆగ్రహానికి గురయ్యారు. రెడ్ల జేఏసీ నేతలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు సభకు హాజరయ్యారు. సభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా కొందరు వ్యక్తులు మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

ఎంత మాత్రం శాంతించకపోవడంతో మధ్యలోనే మంత్రి ప్రసంగాన్ని నిలిపి వేశారు. అయినప్పటికీ సభలో పాల్గొన్న వారిలో కొందరు రెచ్చిపోవడంతో ..మధ్యలోనే వెళ్లిపోయేందుకు ప్రయత్నించిన మంత్రి మల్లారెడ్డిని వెంబడించారు. సభా వేదిక నుంచి వెళ్లిపోతున్న మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పలువురు పరుగులు తీశారు. చేతికి అందిన కుర్చీలు, మంచినీళ్ల బాటిల్స్, రాళ్లు, చెప్పులు కాన్వాయ్ పై విసిరారు. దీంతో సభా వేదిక పరిసరాల్లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పోలీసులు రక్షణగా నిలిచి మంత్రి మల్లారెడ్డిని అక్కడి నుంచి తరలించారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఐదు వేల కోట్లతో రెడ్డి కార్పోరేషన్ ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి మల్లారెడ్డి సభా వేదిక వద్దకు వచ్చినప్పుడు అంతా ప్రశాంతంగానే ఉన్నారు. మంత్రి మైక్ పట్టుకొని స్పీచ్ మొదలు పెట్టిన వెంటనే ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడ్డాయి.

కార్యక్రమంలో పాల్గొన్న వారాంతా తమ సామాజిక వర్గానికి సంబంధించిన మాటలు మాట్లాడుతారని ఎదురు చూశారు. కానీ మంత్రి మాత్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించడంతో మంత్రి ప్రసంగానికి రెండు అడ్డుపడ్డారు. అయినా మంత్రి మాత్రం కేసీఆర్ ను పొగుడుతూ మాట్లాడారు. సభలో పాల్గొన్న వారు కోపంతో ఊగిపోయారు.

Tags:    

Similar News