Formula E Race Case: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు...
Formula E Race Case: కేటీఆర్ కు ఫార్మూలా ఈ కారు రేసులో ఏసీబీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు.
Formula E Race Case: కేటీఆర్ కు ఫార్మూలా ఈ కారు రేసులో ఏసీబీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో కోరారు. ఫార్ములా ఈ కారు రేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈ కేసులో తీర్పు వెల్లడించేవరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. అయితే విచారణ చేసేందుకు ఏసీబీకి హైకోర్టు అనుమతించింది.
2023 డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ గత ఏడాది డిసెంబర్ 20 కేసు నమోదు చేసింది. ఈ నెల 7న విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఈ నెల 8,9 తేదీల్లో బీఎల్ ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. తొలుత వీరిద్దరిని ఈ నెల 2,3 తేదీల్లో విచారణకు రావాలని కోరింది. అయితే విచారణకు సమయం కావాలని కోరడంతో 8,9 తేదీల్లో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది.
ఫార్మూలా ఈ కారు రేసులో నిబంధనల ఉల్లంఘనతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని 2023 డిసెంబర్ 18న పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఏసీబీకి లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా ఏసీబీ విచారణను ప్రారంభించింది. అయితే ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ కూడా గత ఏడాది నవంబర్ లో అనుమతి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఏసీబీకి పంపారు. ఈ లేఖ అందగానే ఏసీబీ డీస్పీ మాజీద్ ఖాన్ కేసు నమోదు చేశారు.
అవినీతే జరగనప్పుడు ఏసీబీ చట్టం కింద కేసులు ఎలా నమోదు చేస్తారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 7న ఈడీ విచారణకు హాజరయ్యే విషయమై న్యాయవాదుల నిర్ణయం ప్రకారంగా వ్యవహరిస్తానని కేటీఆర్ ప్రకటించారు. అయితే ఏసీబీ విచారణకు ఆయన హాజరౌతారా లేదా అనేది చూడాలి.