TS High Court: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్‌

TS High Court: ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేసింది

Update: 2021-04-30 08:46 GMT
TS High court File Photo

TS High Court: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్‌ విధించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన ధర్మాసనం  ఓ పక్క నైట్‌ కర్ఫ్యూ ముగుస్తుంటే.. ఇంకా తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదని మండిపడింది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అభిప్రాయం చెప్పేందుకు 45 నిమిషాల సమయమిచ్చిన హైకోర్టు.. ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే.. తామే ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. 

మరోవైపు తెలంగాణలో నైట్‌ కర్ఫ్యూ ఇవాళ్టితో ముగియనుంది. తదుపరి చర్యలపై ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య మరింత పెరిగినందున మరికొన్ని రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అభిప్రాయం ప్రభుత్వవర్గాల్లో ఉంది.

ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ పొడిగింపునకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ నిర్ణయం ప్రకటించనున్నారు. ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితిపై బంధువులకు తెలిపేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉంటుందంటూ ప్రచారం సాగుతుండగా అదేమీలేదని హోంమంత్రి మహమూద్‌ అలీ, వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

ఇక ఇవాళ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కేసులు పెరుగుతున్న చోట్ల కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించున్నారు. కేసులు భారీగా ఉన్నచోట్ల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది. వ్యాపార వర్గాలకు, ప్రజలకు ఆర్థిక నష్టం కలగకుండా... కరోనా కట్టడికి చర్యలు చేపట్టనున్నారు.




Tags:    

Similar News