మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్‌ మాటలే ప్రధాని నోట...

Narendra Modi - Tamilisai Soundararajan: కమలం క్యాంప్‌లో జరుగుతున్న చర్చ కూడా ఇదేనా..?

Update: 2022-05-28 07:14 GMT

మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్‌ మాటలే ప్రధాని నోట...

Narendra Modi - Tamilisai Soundararajan: ప్రధాని నరేంద్ర మోడీకి ప్రసంగం కాపీ ఇచ్చింది ఎవరు? పీఎం సభ ఒకటి ఉంటుందని పార్టీకి కూడా తెలియనంత సీక్రెట్‌గా స్కెచ్‌ వేసింది ఎవరు? సభ ఏర్పాట్లు పూర్తయ్యే వరకు పార్టీ రథసారథికి కూడా ఎందుకు తెలియనివ్వలేదు? అంతటి సభా వేదికపై సీఎం పేరు ఎక్కడా ఎత్తని పీఎం... పరోక్షంగా కేసీఆర్‌కు చురకలంటించేలా స్క్రిప్ట్‌ రాసిచ్చింది ఎవరు? పార్టీ నుంచి ఎలాంటి సమాచారం తీసుకోకుండా, ఎవరినీ సంప్రదించకుండా... మోడీ కేసీఆర్‌ను ఎందుకు టార్గెట్‌ చేశారు? గవర్నరే ప్రసంగం కాపీ ఇచ్చి ఉంటారన్న మాటపై కమలం క్యాంప్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్‌ వాచ్‌.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ... ఎప్పుడు తెలంగాణకు వచ్చినా అధికారిక కార్యక్రమాలకే పరిమితమవుతున్నారీ మధ్య. అలాంటిది తాజా టూర్‌లో రూటు మార్చారు. అధికార కార్యక్రమాలకు కాస్త సమయం ఉందనుకున్నారో, లేక కావాలనే షెడ్యూల్‌ను మార్చుకొని ఇంకాస్త ముందు హైదరాబాద్‌ చేరుకున్నారో కానీ అనూహ్యంగా సభా వేదిక మీదికి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన సారథ్యంలోని ప్రభుత్వంపై ఎదురు దాడిచేశారు. సాధారణంగా ఎన్నికలప్పుడే ఇలాంటి రాజకీయ ఆరోపణలు గుప్పించే ప్రధానమంత్రి ... తెలంగాణలో అలాంటిదేమీ లేకుండానే సీఎం కేసీఆర్‌ ఫ్యామిలీని టార్గెట్‌ చేసి ఉంటారన్న చర్చ జరుగుతోంది.

ఇక్కడే ఇంకో విషయం వినపడుతోంది. సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ పీఎం మాట్లాడటం వెనుక పార్టీ ఇచ్చిన ఇన్ఫర్మేషనే అని అందరూ అనుకున్నారు. కానీ కాదట! ఎందుకంటే మోడీ తెలంగాణ పర్యటన 26న ఉన్నా.. 25 అర్దరాత్రి వరకు కూడా పార్టీ కార్యకర్తల మీటింగ్ ఉంటుందని పీఎంవో ధృవీకరించలేదట. ఆ మాటకొస్తే అసలు మోడీ ఓ సభలో మాట్లాడుతారని పార్టీ సారథి బండి సంజయ్‌కి కూడా తెలియదట. అలాంటిది, ఎవరి దగ్గర సమాచారం తీసుకోకుండా... తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలపై పార్టీ ప్రతినిధులను సంప్రదించకుండా ప్రధాన ఎలా ప్రసంగించి ఉంటారన్నదే అసలు ప్రశ్నగా మారిందిప్పుడు. మీరిచ్చారా అంటే మీరిచ్చారా... అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌లాంటి నాయకులు ఒకరినొకరు ప్రశ్నించుకోవడం కమలం పార్టీలో కలవరం రేపిందట.

మరి ప్రధానికి ప్రసంగం కాపీలు ఎవరిచ్చారు? తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలను ఎవరు వివరించారు? ఇక్కడే మరో మాట ఇదంతా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగానే జరిగి ఉంటుందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఇచ్చిన సమాచారం మేరకే ప్రధాని మాట్లాడి ఉంటారని కొందరు కమలం నేతలైతే రూఢీ చేస్తున్నారు కూడా. అప్పట్లో వరసగా రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. భేటీ ముగిసిన వెంటనే మీడియాతోనూ మాట్లాడారు. ఒక గవర్నర్‌గా తనకు కేసీఆర్‌ సర్కార్‌ ప్రోటోకాల్‌ మర్యాదలు పాటించడం లేదని ఓపెన్‌ అయ్యారు. ఆ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడిన మాటలు.. ఆమె చేసిన ఆరోపణలనే ఎక్కువగా ప్రధాని తన ప్రసంగంలో వినిపించారని కమలం నేతలు కొందరు అంటున్నారు.

తెలంగాణలో అమరవీరుల త్యాగాలకు విలువ లేకుండా పోయిందనీ, అమరుల త్యాగాల మీద నిర్మితమైన తెలంగాణలో ఆశించిన అభివృద్ధి జరగడం లేదని అప్పట్లో తమిళసై అన్నట్టే... తాజాగా ప్రధాని కూడా మాట్లాడారు. ఇదే అంశం ఇప్పుడు అందరినీ, మరీ ముఖ్యంగా బీజేపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేసిందన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా జాతీయ స్థాయి కమలం పార్టీ నేతలు తెలంగాణకు వచ్చిప్పుడు, రాష్ట్రానికి చెందిన ఇద్దరు ముగ్గురు పెద్ద నాయకుల దగ్గర ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటుంటారు. వారిచ్చిన విషయాలనే తమ ప్రసంగంలో వినిపిస్తుంటారు. ఇది బీజేపీలో ఆనవాయితీ. కానీ... తెలంగాణలో ప్రధాని పర్యటన ఒకటి ఉంటుందని పార్టీ నేతలకు తెలిసినా.. కార్యకర్తల సభ విషయంలో క్లారిటీ లేదంటే... దీని వెనుక కచ్చితంగా గవర్నర్‌ ఉండి ఉంటారని కాషాయదళంలో చర్చ జరుగుతోంది.

తాము ఏమీ సమాచారం ఇవ్వకుండా, తమ నుంచి ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోకుండా... కేసీఆర్‌ సర్కార్‌ గురించి తాము ఏమనుకుంటున్నామో... అవే మాటలు ప్రధాని నోట రావడంపై రాష్ట్ర కమలం నేతలు ఆశ్చర్యపోతున్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌పై పదునైన ఆరోపణలు గుప్పించడం ఒకరకంగా పార్టీలో మంచి జోష్‌ తీసుకొచ్చిందని కమలం నేతలు ఊపిరి పీల్చుకుంటున్నా... మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళ సై వ్యూహకర్తగా పని చేసి ఉంటారని రాజకీయవర్గాల్లో ఓ చర్చనైతే జోరుగా సాగుతోంది.

ప్రధాని స్థాయి నాయకుడు... అన్ని రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను నిఘా వర్గాల ద్వారా తెచ్చుకుంటుంటారు. పార్టీ తరుపున ఓ కార్యక్రమానికి హాజరైతే కచ్చితంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న వాస్తవ పరిస్థితిని లోకల్‌ లీడర్ల ద్వారా తీసుకుంటారు. అలాంటిదేమీ లేకుండా ప్రధాని టీఆర్ఎస్‌ టార్గెట్‌గా రెచ్చిపోవడంతో తమ పని అయిపోయిందని బీజేపీ బిందాస్‌గా చెబుతోందిప్పుడు. మరి ప్రధాని ఆరోపణలతో గులాబీ దళం ఎదురుదాడిని తీవ్రతరం చేస్తుందో... లేదో చూడాలి.

Full View


Tags:    

Similar News