TS Governor Tamilisai: దేశవ్యాప్తంగా కరోనా విళయతాండవం చేస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణలో ఈ మహమ్మారి మరింత విజృంభిస్తోంది. ఈ సమయంలో తెలంగాణలోని రెండు నగరపాలక సంస్థలు, అయిదు పురపాలక సంఘాల్లో జరుగుతున్న ఎన్నికల నిర్వహణపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని గవర్నర్ తమిళిసై ఆదేశించారు.
ఈ నెల 30న వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలు, సిద్ధిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు. నకిరేకల్ పురపాలక సంఘాల్లో జరగనున్న ఎన్నికలను కరోనా విజృంభణ దృష్ట్యా వాయిదా వేయాలని వివిధ రాజకీయ పార్టీలు గవర్నర్‌కు విజ్ఞప్తిచేశాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథితో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై ఆరా తీశారు. వివిధ పార్టీలు లేవనెత్తుతున్న అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని, అన్ని రకాల జాగ్రత్తలతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామని వివరించారు. వీటన్నిటిపై నివేదిక ఇవ్వాలని పార్థసారథికి గవర్నర్ సూచించారు.
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య పెరగడంతోపాటు మరణాలు సంభవిస్తున్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత…సీఎం కేసీఆర్ సహా వందలాది మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌తోపాటు ఐదు మునిసిపాలిటీలో కూడా ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
మరోవైపు కోవిడ్ కష్టకాలంలోనూ అధికార, విపక్షాలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు ఓకే అంటోంది అధికార పక్షం. ఈసీ మాత్రం పోలింగ్ నిర్వహణకే మొగ్గు చూపుతోంది. అటు నైట్ కర్ఫ్యూ… ఇటు డేలో ప్రచారంతో నాయకులు, ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా విజృంభణ పీక్స్‌లో ఉన్న వేళ ఎన్నికల నిర్వహణపై ఆందోళన చెందుతున్నారు.