Srisailam Fire Accident: శ్రీశైలం అగ్ని ప్రమాదం.. భారీగా పరిహారం పెంపు
Srisailam Fire Accident: శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో అందులో పనిచేసే ఉద్యోగులు 9 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
Srisailam Fire Accident: శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో అందులో పనిచేసే ఉద్యోగులు 9 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు జెన్‌కో పరిహారం అందించాలని నిర్ణయించింది. ఆయా కుటుంబాలకు రూ.75 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని, ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. తెలంగాణ జెన్ కో బోర్డు సమావేశం సీఎండీ ప్రభాకర్ రావు అధ్యక్షతన విద్యుత్ సౌధలో శనివారం జరిగింది. జెన్ కోలో జరిగిన ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన డిఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉండగా శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. శ్రీశైలం ప్రమాదంపై బోర్డు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో సీఎండీ పాటు డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు. వీరందరూ మరణించిన వారికి బోర్డు సభ్యులు సంతాపం తెలిపారు.