TS DOST Notification 2020: త్వరలో దోస్త్ షెడ్యూల్... సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు
రాష్ట్రంలో ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్ధుల కోసం ఈ నెల 15 లేదా 16వ తేదీన షెడ్యూల్ విడుదల కానున్నది. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాలు ఈ నెల 15న విడుదల కానున్న నేపథ్యంలో అధికారులు దానికి అనుగుణంగా ఈ షెడ్యూల్ రూపొందిస్తున్నారు. డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్-2020) అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి 2, 3 దశల్లో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనుంది. అలాగే ఈ ప్రక్రియను ఆగస్టు 24 వరకు పూర్తిచేయనున్నారు. ఇక డిగ్రీ మొదటి సంవత్సరం తరగతును యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ ఒకటి నుంచి నిర్వహించాల్సి ఉంది.
అలాగే ఆగస్టు ఒకటి నుంచి ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులను నిర్వహించాల్సి ఉన్నది. దీని కోసం ఇప్పటికే షెడ్యూల్ సిద్ధంచేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్ల నిర్వహణకు సీజీజీ సహకారం అందిస్తున్నది. అలాగే వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలను విద్యార్థులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కోసం ఉపయోగించనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో విద్యాశాఖ అధికారులు ఇప్పట్లో కళాశాలలను తెరిచేయోచనలో లేదని సమాచారం. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కాలేజీలను ఎప్పటినుంచి ప్రారంభించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తుదినిర్ణయం ప్రకటించనున్నది.