కేంద్రంపై సీఎం కేసీఆర్ వరి వార్..
CM KCR: నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
CM KCR: ఇప్పటివరకు తెలంగాణ నుంచే కేంద్రంపై యుద్ధం చేస్తున్న సీఎం కేసీఆర్.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీకే వెళ్లాలని డిసైడ్ అయ్యారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు డిమాండ్ చేయడంతో పాటు పార్లమెంటులోనూ టీఆర్ఎస్ ఎంపీలతో నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేశారు. ఇందుకోసం.. నేడు జరిగే TRSLP సమావేశంలో కార్యాచరణ ప్రకటించనున్నారు. వరి కొనుగోలుపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయడానికి విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులను ఆహ్వానించారు. పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజరుకానున్నారు.
సమావేశంలో వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగం పక్షాన చేయాల్సిన పోరాటాలు, నిరసనలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు నిరసనలు, ఆందోళన చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేనున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఏ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదో బట్టబయలు చేయనున్నారు.
ఇక TRS LP సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేయనున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతులకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కోరనున్నారు. ధాన్యం కొనుగోళ్ళపై కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళన కార్యక్రమాలకు అనుగుణంగా లోక్‌సభ, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేపడతారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100 శాతం FCI సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.