TRS Plenary Today: నేడు టీఆర్ఎస్ ప్లీనరీ, ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
TRS Plenary Today: సభకు ఆరువేల మందికి ఆహ్వానం..పాస్ ఉంటేనే లోపలికి అనుమతి..
TRS Plenary Today: తెలంగాణ రాష్ట్రసమితి మరోసారి ప్లీనరీకి సిద్ధమైంది. ఇవాళ హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ప్రతినిధుల సభ జరగనుంది. 2018 తర్వాత మూడేళ్లకు జరుగుతున్న ఈ సభను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది టీఆర్ఎస్. శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేలా ఈ ఏడాది ప్లీనరీ జరగనుంది. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులతో పాటు కొత్త సంస్థాగత కమిటీల ప్రతినిధులనూ ఆహ్వానించారు. పార్టీని పటిష్ఠం చేసే కార్యాచరణ ప్రణాళికను కేసీఆర్ ఈ వేదికపై వివరించనున్నారు.
ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది. తొలుత అమరవీరులకు కేసీఆర్ నివాళులర్పించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రకటన తర్వాత అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత పార్టీ రాజకీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయి అంశాలపై ఏడు తీర్మానాలు చేయనున్నారు. వీటిని ఏడుగురు నేతలు ప్రతిపాదిస్తారు. అనంతరం వాటిపై చర్చించి, ఆమోదిస్తారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఆరున్నర వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. పురుషులు, మహిళలు గులాబీ రంగు వస్త్రాలు ధరించి రావాలని పార్టీ అధిష్ఠానం నిర్దేశించింది.