TRS Plenary 2022: ఘనంగా టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం...
TRS Plenary 2022: దేశంలో వనరులున్నా వాడుకునే పరిస్థితి లేదు, గవర్నర్ల వ్యవస్థపై కేసీఆర్ ఫైర్
TRS Plenary 2022: టీఆర్ఎస్ పార్టీ 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ హెచ్‌ఐసీసీ వేదికగా ప్లీనరీ సమావేశం ఘనంగా జరిగింది. ముందుగా ప్లీనరీ వేదికపై టీఆర్ఎస్ జెండాను సీఎం ఆవిష్కరించారు. తర్వాత తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు కేసీఆర్. ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక బార్ కోడ్‌లు కేటాయించారు.
సువిశాల వేదికతో పాటు విభిన్న రకాల నోరూరించే రుచులతో భోజనాన్ని వడ్డించారు. టీఆర్ఎస్ పార్టీ 21ఏళ్ల జైత్రయాత్రను తెలుపుతూ దేశ భవిష్యత్‌ను మార్చటంలో పోషించాల్సిన పాత్రపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్టని కోట అన్నారు కేసీఆర్. వెయ్యి కోట్ల ఆస్తి ఉన్న టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల సొంతమన్నారు. తెలంగాణ ప్రయోజనాలు పరిరక్షించే కాపలాదారు టీఆర్‌ఎస్ పార్టీ అన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు గెలిచామన్నారు. నూతన పంచాయత్ రాజ్ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పల్లె, పట్టణ ప్రగతి చేపట్టామన్నారు. దేశంలోనే ఉత్తమ గ్రామాల జాబితాలో మొదటి 10 తెలంగాణ గ్రామాలే ఉన్నట్లు కేంద్రం ప్రకటించిందన్నారు. మన దేశంలోని నదుల్లో 65 వేల టీఎంసీల నీళ్లు లభిస్తే... 30వేల టీఎంసీల లోపే వాడుకుంటున్నామన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో నీటి యుద్ధాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయని... దేశ రాజకీయాలను నడిపే అవకాశం తెలంగాణకు వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుందన్నారు. గవర్నర్ల వ్యవస్థ దుర్మార్గంగా మారిందన్నారు కేసీఆర్. గవర్నర్ల వ్యవస్థతో మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ నడుస్తోందన్నారు. ఎన్టీఆర్‌పై దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థ ప్రయోగించారన్నారు. ఎన్టీఆర్ పట్ల గవర్నర్ తీరు, నాటి పరిణామాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలన్నారు కేసీఆర్.
మేరా భారత్ మహాన్ అన్న ప్రజల కల త్వరలో నెరవేరబోతోందన్నారు మంత్రి కేటీఆర్. దేశ ప్రజలకు కోరుకుంటున్న ఆ కల నెరవేర్చే నాయకుడు తెలంగాణ దేశానికి అందించబోతోందన్నారు. కుల రాజకీయాలు, బిల్డప్, బుల్డోజర్ ఐకానిక్ నేతలు కాకుండా దేశంలో ప్రజా సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వ పథకాలు అమలు చేసే విజన్ ఉన్న కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ దేశానికి అవసరమన్నారు. డబుల్ ఇంజిన్ నినాదంతో అభివృద్ధి మాట దేవుడెరుగు.. ధరలు మాత్రం డబుల్ చేశారన్నారు. కొత్త ఉద్యోగాల సంగతి ఏమో గానీ ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ధరకు సిలిండర్ అమ్ముతున్న దేశంగా భారత్ నమోదైందన్నారు కేటీఆర్.