ధాన్యం విషయంలో టీఆర్ఎస్ కుంభకోణం బయటకు తీయాలి - అమిత్ షా
Amit Shah: కేసీఆర్‌పై రాజీలేని పోరాటం చేయాలని అమిత్ షా పిలుపు...
Amit Shah: తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ నాయకత్వం మరింత ఫోకస్ పెంచుతోంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. అంతేకాదు.. కేసీఆర్‌పై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం చేపట్టిన కార్యక్రమాలను కూడా షా మెచ్చుకున్నట్లు సమాచారం. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
టీఆర్‌ఎస్ సర్కార్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని షా చెప్పినట్లు సమాచారం. టీఆర్ఎస్ నేతల అవినీతిపై కూడా దృష్టి సారించాలని.. వాటిని ఎత్తిచూపేలా ఉండాలని చెప్పినట్లు తెలుస్తోంది. ధాన్యం విషయంలో కూడా కేంద్రాన్ని బంద్‌నాం చేస్తున్నారని రాష్ట్ర నాయకులకు చెప్పిన అమిత్ షా.. టీఆర్ఎస్ బియ్యం కుంభకోణాన్ని బయటకు తీయమని చెప్పినట్లు సమాచారం. ఇక ఉపఎన్నికలో విజయం సాధించిన రఘునందన్‌ను, ఈటలను మరోసారి అభినందించారు అమిత్ షా.
రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అమిత్ షా అడిగి తెలుసుకున్నారని బీజేపీ నాయకులు చెప్పారు. పార్టీని విస్రృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలను కూడా వివరించారని తెలిపారు. త్వరలోనే అమిత్ షా తెలంగాణకు వస్తారని, రాష్ట్రంలో బీజేపీ రావడమే లక్ష్యంగా సూచనలు చేస్తారని వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలు అయిపోగానే షా రాష్ట్రానికి వస్తారని, అందుకు సంబంధించిన టూర్ ప్లాన్ సిద్ధం చేసి పంపుతామని తెలంగాణ బీజేపీ నేతలు తెలియజేశారు.