Nagarjuna Sagar: సాగర్ ఉపఎన్నికకు టీఆర్ఎస్ ప్రత్యేక ప్రణాళికలు
Nagarjuna Sagar: రంగంలోకి దిగిన యువ ఎమ్మెల్యేలు..సాగర్ ఓటర్లలో అవగాహన పెంచే కార్యక్రమాలు..గడప గడపకు తిరుగుతున్న గులాబీ ఎమ్మెల్యేలు
Nagarjuna Sagar: ఎమ్మెల్సీలు ఖాతాలో పడ్డాయి. ఇక మిగిలింది సాగర్‌లో ఈత కొట్టడమే. దానికే రెడీ అవుతోంది గులాబీ క్యాంప్. రెండు ఎమ్మెల్సీల గెలుపుతో ఉత్సవాలు జరుపుకుంటున్న క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహం నింపేలా గులాబీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అస్త్రాలకు పదును పెడుతున్నారు. ప్రగతిభవన్ కేంద్రంగా నాగార్జునసాగర్‌లో గెలిచే వ్యూహాలను రచిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను మంత్రుల భుజాలపై మోపినట్టుగానే... సాగర్ రెస్పాన్సిబిలిటీని కూడా అమాత్యులకే అంటగట్టేలా పథకరచన చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే సాగర్ ఉపఎన్నికకు ప్రత్యేక ప్రణాళికలను రచిస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సాగర్‌ను చుట్టేస్తూ ప్రచారం నిర్వహిస్తుండగా... మంత్రులను కూడా ప్రచారగోదాలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులను ఇన్‌ఛార్జిలుగా నియమించినట్టుగానే... సాగర్ ఉపఎన్నికల్లో అదే ఫార్ములాను అమలు చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్...మరోమారు సాగర్‌లో పాగా వేయాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్.... సాగర్‌లోనూ కొంతమంది కీలక మంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నారు. బీజేపీ కాంగ్రెస్‌లకు చెక్ పెడుతూనే సాగర్‌లో గెలుపుపై వ్యూహరచన చేస్తున్నారు సీఎం.
ఇప్పటికే హాలియలో ఉపఎన్నిక ప్రచార సన్నాహా సభ ఏర్పాటు చేసి ప్రజలను టీఆర్‌ఎస్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే యువ ఎమ్మెల్యేలను రంగంలోకి దింపిన సీఎం... ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, అమలవుతున్న విధానాలను చెబుతూనే... అవి ప్రజలకు చేరవవుతున్న తీరును అడిగి తెలుసుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రభుత్వం కావాలా.... లేక సమస్యలు సృష్టించే ప్రతిపక్షాలు కావాలా అంటూ ఓటర్లలో అవగాహన పెంచుతున్నారు. కులాలు, మతాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ గడప గడపకు తిరుగుతున్నారు. గతంలో టీఆర్‌ఎస్‌కు దూరంగా యువకులను ఆకర్షించేందుకు ప్లాన్ చేయాలని మంత్రులను ఆదేశించారు
నాగార్జునసాగర్‌లో ఉన్న ఏడూ మండలాలకు ఏడుగురు మంత్రులను నియమించారు. హరీష్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావులకు బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరికి సీఎం కేసీఆర్ సాగర్ బాధ్యతలను వారి భుజాలపై మోపారు. సాగర్‌లో బీసీలు ఎక్కువగా ఉన్నందున ఆ సామాజికవర్గాన్ని ఎక్కువగా ఆకర్షించేందుకు మంత్రి తలసానికి ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు. లక్షకు పైగా ఉన్న యాదవులను టీఆర్‌ఎస్ వైపు తిప్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇప్పటికే ఓటర్ నాడీ తెలుసుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం.... ఎట్టి పరిస్థితుల్లో సాగర తీరంలో టీఆర్ఎస్ జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఏ ఎన్నిక జరిగిన విజయం తమదే అనే నినాదాన్ని మరోసారి నిరూపించేందుకు పథక రచన చేస్తున్నారు. మరి... త్రిముఖ పోరులో సాగర్ ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారో చూడాలి.