ఆయన వ్యవహారం చూస్తే లోప్రొఫైల్ పర్సన్‌లా కనిపిస్తారు. కానీ కేరాఫ్ కాంట్రావర్సీస్. ఆయన పేరులోనే మంచి వుంది నోరు తెరిస్తే బండబూతుల దంచుడే. మాట్లాడేందుకు కార్యకర్తలొచ్చినా, గోడు వినిపించేందుకు జనమొచ్చినా, ఆయన మాత్రం దబిడి దిబిడే అంటారట. ఆ ఎమ్మెల్యే పేరు వింటేనే అధిష్టానం రగిలిపోతోందట. ఎవరా నాయకుడు..? వివాదాల ప్రతినిధిగా పేరెందుకు?
ఆయన మరెవరో కాదు హైదరాబాద్ శివారు నియోజికవర్గం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి. మంచిరెడ్డి కిషన్ రెడ్డి. పేరులో మంచి ఉన్నా, ఆయన నుంచి అలాంటిది ఆశించడం కష్టమంటున్నారు అదే పార్టీ నేతలు. అధికార పార్టీలో, లో ఫ్రోఫైల్ మైయింటైన్ చేస్తూ, పెద్దగా హడావుడి చెయ్యకపోయినా, వివాదాలకు మాత్రం కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్నారట మంచిరెడ్డి. నిత్యం కాంట్రావర్సీలతో సహజీవనం చేస్తుంటారన్న పేరుంది ఆయనకు. మొన్న అబ్డుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో దహనం కేసు అయినా నిన్న యాచారం ఎంపిపిపై దురుసుగా ప్రవర్తించడమైనా, తాజాగా యాచారం ఫార్మా ఇండస్ట్రీలో రైతుల కొట్లాటయినా, వరుసగా వివాదాల్లో మునిగితేలున్నారు మంచి రెడ్డి. అదే గులాబీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.
2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన మొదట్లోనే, అబ్డుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో దహనం కేసులో మంచి రెడ్డి పేరును, ప్రతిపక్ష కాంగ్రెస్ తెరపైకి తీసుకురావడంతో చర్చనీయాంశమైంది. భూ వ్యవహారాల్లో తల దూర్చడం వల్లనే, పాస్ బుక్‌లను ఎమ్మార్వో సకాలంలో ఇవ్వలేకపోయారన్న మాటలు వినిపించాయి. ఇదే ఆగ్రహంతోనే స్థానిక రైతులు అంతటి దారుణానికి తెగబడ్డారట. ఆ సమయంలో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయనపై అనేక ఆరోపణలు చేశారు కూడా.
ఆ తరువాత యాచారం మండలంలో మరో వివాదంతో వార్తల్లోకి ఎక్కారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఓ అభివృద్ది కార్యక్రమంలో, బిజేపి మహిళా ఎంపిపినీ, పక్కకు నెట్టి, కాంట్రావర్సీ క్రియేట్ చేశారట. ప్రోటోకాల్ ప్రకారం అభివృద్ది కార్యక్రమంలో కొబ్బరికాయ కొట్టడానికి వచ్చిన మహిళా నేతకు అవకాశం ఇవ్వకుండా, తానొక్కడే శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలన్న ఆలోచనతో, మహిళా నేతను పక్కకు తోసేశారట ఎమ్మెల్యే. దీంతో ఎమ్మెల్యేపై కేసు పెట్టారామె. మహిళా సంఘాలు సైతం ఆమెకు మద్దతుగా నిలబడ్డాయి. సదరు ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ వ్యవహారంలో గులాబీ అధిష్టాన పెద్దలు సైతం, మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మందలించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఇక తాజాగా యాచారం మండలంలో ఫార్మా ఇండస్ట్రీస్ కోసం భూములు స్వాధీనం చేసుకోవద్దంటూ స్థానిక రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. దీనికి విపక్ష పార్టీల మద్దతు లభించడంతో, పోరాటం మరింత ఉదృతమైంది. దీంతో అక్కడ రైతులు, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిసన్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారట. ఆయనే స్వయంగా తమ భూములను ఫార్మాకంపెనీకి అప్పగిస్తున్నారనే ఆక్రోశంతో ఊగిపోతున్నారట. అయితే రైతుల సమస్యలు పట్టించుకోకుండా, మేడిపల్లి గ్రామంలో భారీ వర్షాలకు చెరువు అలుగు ఎల్లడంతో, పూజలు చెయ్యడానికి అక్కడికెళ్లిన ఎమ్మెల్యే మంచి రెడ్డిపై, ఆ గ్రామ ప్రజలు తిరగబడటంతో, మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. నియోజికవర్గంలో రైతుల సమస్యను పట్టించుకోకుండా ప్రచారం కోసం వచ్చిన ఎమ్మెల్యేపై, చెప్పులు విసిరే ప్రయత్నం చెయ్యడంతో, అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై రిపోర్ట్ ఇప్పించుకున్న పార్టీ హైకమాండ్, ఆయనపై అసహనం వ్యక్తం చేసిందట.
మొత్తానికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంటేనే, కేరాఫ్ కాంట్రావర్సీగా మారిపోయిందన్న మాటలు వినిపిస్తున్నాయి. తన దగ్గరకు వచ్చే పార్టీ కార్యకర్తలతోనూ ఆయన దురుసుగా ప్రవర్తించారని, ప్రగతిభవన్‌కు ఫీడ్‌బ్యాక్‌లు అందాయట. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే జనంతోనూ, ఆయన ఇలాగే వ్యవహరిస్తారని, పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి గులాబీ అధిష్టానం సైతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేపై సీరియస్‌గా వుందని, టీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. అయితే, ఇదంతా తానంటే గిట్టని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారని, అధిష్టానం తనపై ఏమాత్రం కోపంగా లేదంటున్నారట మంచిరెడ్డి కిషన్ రెడ్డి. నిజం పైవాడికి ఎరుక.