గ్రేటర్ ఫలితాలతో టీఆర్ఎస్ నేతల్లో గుబులు!
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఆర్ఎస్ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. ఏ ఎన్నికలు వచ్చినా.. వార్ వన్ సైడ్ గా మార్చేసి విక్టరీ కొట్టింది. అలాంటి పార్టీకి ఆరేళ్లు గడిచేసరికి పరిస్థితి తారుమారైంది.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో అనూహ్య ఫలితాల తర్వాత కారు పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. ఇప్పటికే నేతలు ఫలితాలను సమీక్షించుకునే పనిలో పడ్డారు. అభ్యర్థులను మార్చిన డివిజన్లలో గెలిచి... సిట్టింగ్ అభ్యర్థులు ఉన్న స్థానాల్లో ఘోరంగా ఓడిపోయానే ఆలోచనలో ఉన్నారట. అయితే గ్రేటర్ నేతల సమావేశంలో కేటీఆర్ చేసిన కామెంట్స్...ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.. భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తున్నాయి... ఇంతకీ కేటీఆర్ మాటల వెనుక మతలబేంటి.. మేయర్ ఎంపికపై ఇచ్చిన సంకేతాలు ఏంటి...?
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టిఆర్ఎస్ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. ఏ ఎన్నికలు వచ్చినా.. వార్ వన్ సైడ్ గా మార్చేసి విక్టరీ కొట్టింది. అలాంటి పార్టీకి ఆరేళ్లు గడిచేసరికి పరిస్థితి తారుమారైంది. లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బిజెపి.. దుబ్బాకలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. జీహెచ్ఎంసీలో మేయర్ పీఠం దక్కకుండా దెబ్బ కొట్టింది. తాజా పరిస్థితులు టిఆర్ఎస్ నేతలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిహెచ్ఎంసి ఫలితాల మీద ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తి చేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... గ్రేటర్ నేతల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి.
జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ 76 మంది సిట్టింగులకు రెండోసారి అవకాశం ఇచ్చింది. 26 చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చింది. కొత్తగా పోటీచేసిన అభ్యర్థుల్లో 24 మంది విజయం సాధించారు. కానీ సిట్టింగుల్లో మాత్రం మెజార్టీ స్థానాల్లో ఓడిపోయారు. దీంతో సిట్టింగ్ కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకతను అంచనా వేయకుండా.. మళ్లీ వారికి అవకాశం కల్పించడమే కొంప ముంచిందని భావిస్తున్నారు పార్టీ నేతలు. గ్రేటర్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించి ఎమ్మెల్యేలను, మంత్రులను హెచ్చరించారట. ఇదే పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఉంటుందని.. స్థానికంగా పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సూచించారట. గ్రేటర్ ఫలితాల నుంచి గుణపాఠం నేర్చుకొని సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అరడజను మంది ఎమ్మెల్యేలకు తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యే లు అందరికీ మరో మారు అవకాశం ఇచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడంలేదు. ఫర్ఫార్మెన్స్ ఆధారంగా టికెట్లు కేటాయించాలని డిసైడ్ అయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగానే ఎమ్మెల్యేలకు ఆ సంకేతాలు ఇచ్చారు. సిట్టింగ్లకిచ్చి లెక్క తప్పాము... అసెంబ్లీ ఎన్నికలకు అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇక జాతీయ స్థాయిలో జమిలి ఎన్నికలు 2022లో అవకాశం ఉందని అని కేటీఆర్ చెప్పడంతో.. తమపై వ్యతిరేకతని తుడిచిపెట్టుకోవాలని ఎమ్మెల్యేలంతా జాగ్రత్తలు తీసుకునే పనిలో పడ్డారు.
ఇక ఇదిలా ఉంటే జిహెచ్ఎంసి లో మేయర్ ఎంపిక విషయంలోనూ కేటీఆర్ ఆసక్తికర కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. గ్రేటర్ ప్రజల తీర్పుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారట. ఎవరికి మేయర్ పీఠం దక్కించుకునే సంపూర్ణ మెజారిటీ ఇవ్వనందున... అందుకోసం తాము కూడా తాపత్రయం పడాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తుంది. మేయర్ పీఠం కోసం ఎవరి మద్దతు కోసమో తాము మోకరిల్లాల్సిన అవసరం లేదన్నారట. మద్దతుతో మేయర్ పీఠం దక్కించుకోవడం కంటే.. స్పెషల్ ఆఫీసర్ పాలనకైనా సిద్ధమవుతున్నారట.