మంత్రి కేటీఆర్‌ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదు : టీఆర్ఎస్ నేతలు ఫైర్

రేవంత్‌రెడ్డి తీరు దొంగే దొంగ అని అరుస్తున్నట్లుగా ఉందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు.

Update: 2020-06-07 11:34 GMT
Karne Prabhakar(File photo)

రేవంత్‌రెడ్డి తీరు దొంగే దొంగ అని అరుస్తున్నట్లుగా ఉందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. మంత్రి కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన తప్పుడు ఆరోపణలను ఖండించారు. తెలంగాణ భవన్‌లో ఈ నిర్వహించిన మీడియా సమావేశానికి ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, భానుప్రసాద్‌, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, సైదిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా బాల్కసుమన్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి అక్రమ భాగోతాలన్నీ రానున్న రోజుల్లో బయటపెడతామని ఆయన వెల్లడించారు. రేవంత్‌రెడ్డి చెబుతున్న భూములు కేటీఆర్‌వి కాదని చెప్పారు. కేటీఆర్‌ ఆస్తుల వివరాలన్నీ పబ్లిక్‌ డొమైన్‌లోనే ఉన్నాయని చెప్పారు. వట్టినాగులపల్లిలో రేవంత్‌ బంధువుల పేరుపై భూములు ఉన్నాయని సుమన్‌ ఆరోపించారు. గోపన్‌పల్లిలో దళితుల భూములను రేవంత్ లాక్కున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అని ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నాశనమే అని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్‌ 66లో రేవంత్‌రెడ్డి అక్రమ కట్టడాల వివరాలను బయటపెట్టామని అన్నారు. రేవంత్ రెడ్డి ఓ పెయింటర్ స్థాయి నుంచి కోట్లాది ఆస్తులు ఎలా సంపాదించగలిగారని ప్రశ్నించారు.

అనంతరం ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ మాట్లాడుతూ న్యాయస్థానాల పట్ల తమకు గౌరవం ఉందని, కేటీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించడం తగదన్నారు. మంత్రి కేటీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటంపై కాంగ్రెస్‌ నేతలు పునరాలోచించుకోవాలని సూచించారు. రేవంత్‌ రెడ్డి ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వెల్లడించారు. ఫామ్‌ హౌస్‌ వ్యవహారంపై ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ స్పష్టత ఇచ్చారని, కావాలనే ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని నేతలు తెలిపారు. రేవంత్‌ రెడ్డి ఎన్నోసార్లు జైలుకు వెళ్లొచ్చారని విమర్శించారు.

బ్లాక్‌మెయిల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌ రెడ్డి అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు ఇక్కడ నడవవని అన్నారు. అనంతరం మండలిలో ప్రభుత్వ విప్‌ భానుప్రసాద్‌ మాట్లాడుతూ క్రిమినల్‌ కేసులు జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి బాధ్యత కలిగిన పదివిలో ఉన్న కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారనివిమర్శించారు. ప్రజలు కరోనా బాధపడుతుంటే కాంగ్రెస్‌ నేతలు అడ్రస్‌ లేకుండా పోయారని విమర్శించారు. దేశంలో యూత్‌ ఐకాన్‌గా ప్రపంచం మెచ్చిన నాయకుడు కేటీఆర్‌ అని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని పేర్కొన్నారు.

Tags:    

Similar News