ఆదివాసీలు వనమూలికలనే వైద్యంగా ఉపయోగిస్తున్న నేర్పరులు. కడుపునొప్పి నుండి పడకవేయించే పక్షవాతాన్ని ఆకు పసరుతో దూరం చేస్తున్న దన్వంతరీలు. విరిగిన ఎముకలను తీగ మొక్కలతో అతకబెడుతున్న ఆధునిక డాక్టర్లు.
ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల ఖిల్లా. ఇక్కడి ఆదివాసీలు ఎన్నో ఏళ్లుగా అడవిలోనే జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ అడవుల్లో దేశంలోనే ప్రసిద్ధి చెందిన వనమూలికలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు ఈ వనమూలికలు ఇప్పుడు మొండి రోగాలను నయం జేసే సంజీవనిలుగా మారాయి.
ప్రధానంగా వర్షాకాలంలోనే గిరిజనులు విషజ్వరాలతో బాధపడుతుంటారు. దీంతో వాళ్లు వనమూళికల ఔషదాన్ని తాగి రోగాన్ని నయం చేసుకుంటున్నారు. అదేవిధంగా పక్షవాతం, కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాలతో బాధపడుతున్నవారికి ప్రకృతి వైద్యం చేసి ఔరా అనుపించుకుంటున్నారు. ఇక విరిగిన ఎముకలను సైతం సాంప్రదాయ వైద్యంతో అతికిస్తున్నారు. దీంతో ఆయుర్వేద వైద్యానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు గిరిజనులు.