Train Accident at Vikarabad: వికారాబాద్ సమీపంలో రైలు ఇంజన్ ప్రమాదం.. ముగ్గురు మృతి.. 9మంది సేఫ్

Train Accident at Vikarabad: వికారాబాద్ రైల్యే స్టేషన్ సమీపంలో ట్రాక్ పనులు చేస్తున్న గ్యాంగ్ మేన్ లపై అనుకోని విధంగా రైలింజన్ దూసుకురావడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2020-07-23 03:15 GMT
Train Engine

Train Accident at Vikarabad: వికారాబాద్ రైల్యే స్టేషన్ సమీపంలో ట్రాక్ పనులు చేస్తున్న గ్యాంగ్ మేన్ లపై అనుకోని విధంగా రైలింజన్ దూసుకురావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో తొమ్మిది మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

రైల్వే ఉద్యోగులు 12 మంది వంతెనకు పెయింటింగ్‌ వేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈలోగా వారు పని చేస్తున్న ట్రాక్‌పైనే ఒక రైలింజన్‌ దూసుకువస్తోంది. అది గమనించి.. ప్రాణా లు అరచేత పట్టుకుని ఆ ఉద్యోగులు పరుగులు తీశారు. అయినా, ఆ రైలింజన్‌ వేగం తగ్గలేదు. అది వంతెన కావడంతో.. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. అనే చందంగా వారి పరిస్థితి మారింది. హాహాకారాలు చేస్తూ.. కొందరు ట్రాక్‌పై పరిగెడితే.. మరికొందరు వంతెనకు అనుసంధానమై ఉండే సేఫ్టీ క్యాబిన్‌లోకి చేరుకున్నారు. ఈలోగానే దారుణం జరిగిపోయింది. క్షణాల్లో దూసుకువచ్చిన ఆ మృత్యుశకటం, ట్రాక్‌పై పరిగెడుతున్న ఆ ముగ్గురినీ ఢీకొట్టింది. ఆ ధాటికి వారు ఎగిరిపడ్డారు.

ఒకరు బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయారు. దీంతో అక్కడికక్కడే వాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారు. వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతి చెందినవారిలో ప్రతా్‌పరెడ్డి, నవీన్‌, శంషీర్‌ అలీ ఉన్నారు. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ, డీఎస్పీ సంజీవరావు, సీఐ శ్రీనివాస్‌ ప్రమాద వివరాలను సేకరించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గత రెండు దశాబ్దాల కాలంలో ఇలాంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. 18 ఏళ్ల కిందట చిట్టిగిద్ద రైల్వే స్టేషన్‌లో ముగ్గురు గ్యాంగ్‌మన్లను ఓ రైలింజన్‌ పొట్టబెట్టుకుంది.


Tags:    

Similar News