హైదరాబాద్ లో ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు!
* నగరవ్యాప్తంగా అన్ని ఫ్లై ఓవర్లు మూసివేత * ఉదయం 11 నుంచి కేబుల్ బ్రిడ్జ్, ఓఆర్‌ఆర్.. * పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే, బయోడైవర్సిటీ, జేఎన్‌టీయూ..
నగరంలో కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాదీలు సిద్ధమవుతున్నారు. అయితే కొవిడ్ నేపథ్యంలో ఇప్పటికీ ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధించగా.. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లు ట్రాఫిక్ విషయంలోనూ ఆంక్షలు విధించాయి. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టీయూ, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్లతో పాటు.. దుర్గం చెరువు తీగల వంతెనను మూసివేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఇక ఓఆర్‌ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై కార్లు, జీపులకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
మరోవైపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం వరకు వాహనాల రాకపోకలను నిషేధించారు. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్క్, బీఆర్‌కే భవన్, తెలుగుతల్లి కూడలి, లిబర్టీ జంక్షన్, నల్లగుట్ట రైల్వే వద్ద వాహనాలను దారి మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా విధించిన ఆంక్షలతో బేగంపేట ఫ్లైఓవర్ మినహా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు.