TPCC chief: తెలంగాణ పీసీసీ చైర్మన్ పదవిపై వీడని ఉత్కంఠ

TPCC chief * ఇవాళ ఫైనల్ అయ్యే అవకాశం * టీపీసీసీ చీఫ్ ఎంపికపై హైకమాండ్ తుది కసరత్తులు * రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు పరిశీలన

Update: 2021-01-05 03:08 GMT

Congress emblem (file image)

TPCC chairman: తెలంగాణ పీసీసీ కొత్త చీఫ్ నియామకం ఎవరిని నియమించాలనేది హై కమాండ్‌కు సవాల్‌గా మారింది. పీసీసీ పీఠాన్ని ఎవరు అధిష్టించనున్నారనే అంశం పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. అధ్యక్షుడి ప్రకటన ఆలస్యమయ్యే కొద్ది కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తోంది. సామాజిక సమీకరణాలపై కసరత్తు వల్లే అధికారిక ప్రకటన ఆలస్యమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణికం ఠాగూర్ సూచనల మేరకు సోనియా గాంధీ కొత్త చీఫ్‌ను ఖరారు చేయనున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించగా.. ఆ స్థానం భర్తీపై అధిష్టానం దృష్టిసారించింది. కొత్త సారథి ఎంపిక ప్రక్రియను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం‌ ఠాగూర్‌ పూర్తి చేశారు. పార్టీ సీనియర్ల అభిప్రాయాలు సేకరించారు. ఇది కాస్త వివాదాస్పదమైంది. తమను సంప్రదించలేదంటూ వీహెచ్ వంటి సీనియర్లు బహిరంగగానే విమర్శించారు. హస్తిన పెద్దలను తప్పుదోవ పట్టిస్తున్నారని కొందరు నేతలు ఆరోపించారు. అయితే.. స్థానం ఖాళీ అయి రెండు నెలలు దాటినా ఇంకా కొత్త సారథి పేరు వెలువడటం వెనుక ఆలస్యమేంటనే ఉత్కంఠ పార్టీలో కొనసాగుతోంది.

కొత్త పీసీసీ ఎంపిక కోసం 169 మంది పార్టీ నేతలతో పాటు జిల్లాల్లో కీలక నాయకులు, జిల్లా, మండల స్థాయి అధ్యక్షుల నుంచి అధిష్ఠానం అభిప్రాయాల్ని తెలుసుకుంది. నేతల మధ్య పోటీ అధికంగా ఉండటం వల్ల.. కొందరు సీనియర్లను ఢిల్లీకి పిలుపించుకుని చర్చించింది. పీసీసీ అధ్యక్షుడితో పాటు కార్యనిర్వహక అధ్యక్షులు, కోర్‌కమిటీ, ప్రచార కమిటీ, సమన్వయ కమిటీలను పూర్తి చేసి ప్రకటించాలని అధిష్ఠానం యోచిస్తోందని హస్తిన ఏఐసిసి వర్గాల వెల్లడిస్తున్నాయి. చీఫ్ పోస్ట్‌ కోసం చాలా మంది నేతలు పోటీపడ్డారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి లాంటి ప్రముఖులు రేసులో ఉన్నట్టు పేర్లు వినిపించాయి.

తొలుత రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపినట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో పార్టీలో అసంతృప్తి సెగలు రేగాయి. కొందరు సీనియర్లు రేవంత్‌కు పీసీసీ ఇవ్వొద్దంటూ బహిరంగంగానే ప్రకటనలు చేశారు. పార్టీ హైకమాండ్‌కు లేఖలు రాసినట్టు వార్తలు వెలుగులోకి వచ్చాయి. కోమటిరెడ్డి పేరుపైనా అభ్యంతరాలు రావడంతో.. ఇప్పుడు అనూహ్యంగా జీవన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. పార్టీలో కీలకంగా ఉన్న జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News