Telangana: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
Telangana: అన్‌లాక్ పై కీలక నిర్ణయం * రేపటితో ముగియనున్న లాక్‌డౌన్ * మే12 నుంచి కొనసాగుతున్న లాక్‌డౌన్
Telangana: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులు.. లాక్‌డౌన్ అమలు, ఇరిగేషన్, రైతుబంధు, కల్తీవిత్తనాలు, వ్యవసాయ పనులపై చర్చించనున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పగటి పూట పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేయాలని ప్రభుత్వం చూస్తోంది. లేకుంటే.. మినహాయింపు సమయాన్ని పొడిగించి.. రాత్రిపూట కర్ఫ్యూ పెట్టి పకడ్భందీగా అమలు చేయాలని చూస్తోంది. లాక్‌డౌన్‌తో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో.. మరోమారు ఎక్కువ సడలింపులతో లాక్‌డౌన్ పెంచేందుకు సర్కార్ నిర్ణయం తీసుకోనుంది.
ముందు ముందు థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండడంతో.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలో కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 12ఏళ్లలపై బడిన పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం సర్వే చేపట్టనుంది.. ఇంతకుముందు ఫివర్ సర్వేతో సత్ఫలితాలు రావడంతో.. మరోసారి అలాంటి సర్వే చేయనున్నట్టు తెలుస్తోంది. రేపు 19 జిల్లాల్లో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రారంభించనున్నారు. ఎవరెవరు ఎక్కడ పాల్గొనాలనేది మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
వచ్చే వానాకాలం సీజన్‌లో వేయాల్సిన పంటల గురించి కేబినెట్ లో చర్చించనున్నారు. కల్తీ విత్తనాలు, రసాయన మందులు విక్రయించే వారిపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు వీలు కల్పిస్తూ అత్యవసర ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వానాకాలం సాగు, ఎరువులు, విత్తనాలు, రసాయన మందులను అందుబాటులో ఉంచడం, రైతుబంధు సాయం పంపిణీ, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ధరణి ఫిర్యాదుల పరిష్కారం, కరోనా మూడో వేవ్‌కు సన్నద్ధత, వైద్య సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది.
మరోవైపు.. కరోనా నేపథ్యంలో ఇంటర్మీడియెట్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలను రద్దు చేసిన విద్యార్థులందరినీ పాస్ చేయాలని ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సాధించిన మార్కులకు సమానంగా సెకండ్ ఇయర్ సబ్జెక్టుల్లో వేసి అందరినీ పాస్ చేయాలని ప్రతిపాదించింది. దీనిపై కేబినెట్ చర్చించి నిర్ణయం ప్రకటించనుంది...