Telangana: తగ్గనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు.. ఇవాళ, రేపు వర్షాలు
Telangana: ఉపరితల ద్రోణి ప్రభావంతో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
Telangana: తెలంగాణలో కొన్నాళ్ల నుంచి దంచికొడుతున్న ఎండలతో కాస్త ఉపశమనం లభించనుంది. రానున్న రెండురోజుల పాటు ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పడనున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగా నమోదవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీలు నమోదయ్యాయి. దీంతో మండుటెండలకు రాష్ట్రంలో జనం బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ద్రోణితో పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.