కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

* ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్‌ భారత్‌ పేరిట పథకం అమలు * కరోనాకు అందించే చికిత్సలను 17 రకాలుగా విభజన

Update: 2021-08-30 00:52 GMT

ఆరోగ్యశ్రీ (ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చుతున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో 'ఆరోగ్యశ్రీ ప్లస్ ఆయుష్మాన్‌ భారత్‌' పేరిట ఈ పథకం అమలుకానుంది. కరోనాకు అందించే చికిత్సలను మొత్తంగా 17 రకాలుగా విభజించి ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చారు. అయితే తొలిదశలో దీనిని ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేయగా దశలవారీగా ప్రైవేటు ఆస్పత్రులకు విస్తరించే అవకాశం ఉంది.

కరోనాతో వచ్చే పలురకాల వ్యాధులకు ప్యాకేజీల వారీగా చికిత్స అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, క్రిటికల్‌ కేర్‌ కేటగిరీల్లో ప్యాకేజీల కింద వైద్య సేవలు అందుతాయి. ఆ ప్రకారమే ఆస్పత్రులకు ప్యాకేజీలు అందజేస్తారు. వైరస్‌ల కారణంగా వచ్చే అన్నిరకాల జ్వరాలకు ఆరోగ్యశ్రీ వర్తించనుంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా లాంటి వాటికి కూడా ఆరోగ్యశ్రీ వర్తించే అవకాశం ఉందని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయడంతో కరోనా రోగులకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా ఆయా సర్కారు ఆస్పత్రులకు అందజేయనుంది. వాస్తవానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నిటిలో ఆరోగ్యశ్రీ కింద కరోనాకు ఉచిత చికిత్స అందించాలని ప్రభుత్వం భావించింది. కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంది. స్వైన్‌ఫ్లూను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News