ఈనెల 9 నుంచి రైతు యాత్ర ప్రారంభించనున్న టీ కాంగ్రెస్

* సీఎల్పీ భట్టి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పర్యటన * ఆదిలాబాద్ జిల్లా భీంసూర్‌ నుంచి యాత్ర ప్రారంభం * నాగర్ కర్నూల్ జిల్లాలోని తాండ్రతో ముగియనున్న టూర్

Update: 2021-02-04 02:35 GMT

Representational Image

తెలంగాణ కాంగ్రెస్ రైతులను కలుపుకుపోవడానికి ప్రణాళికలు చేస్తోంది. వారితో మమేకమయ్యేందుకు యాత్రకు శ్రీకారం చుడుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న అంశాలను ప్రస్తావిస్తూ పార్టీ ఎమ్మెల్యేలు ఆదిలాబాద్ నుండి యాత్ర చేయడానికి ప్రణాళిక సిద్దం చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసంతృప్తిలో ఉన్న రైతులను తమ వైపు మలుపుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి సీఎల్పీ బృందం రాష్ట్రంలో పర్యటించడానికి సిద్ధమైంది. ఈ నెల తొమ్మిది నుండి ఆదిలాబాద్ నుండి యాత్రను చేయడానికి షెడ్యూల్ ఖరారు చేసింది టీ కాంగ్రెస్. ఆదిలాబాద్ జిల్లా భీంసూర్ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టి.. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి వరకు దాదాపు పది రోజుల పాటు యాత్రను చేయడానికి పార్టీ రూట్ మ్యాప్ సిద్దం చేసింది. పార్టీ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ ఈ రైతు యాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్రలో రైతుల కష్టాలు కొత్త వ్యవసాయ చట్టాల్లో ఉన్న అంశాలను రైతులకు వివరించనుంది సీఎల్పీ బృందం.

ఈనెల 9న హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ జిల్లా భీంసూర్‌, బోథ్ నియోజకవర్గంలోని ధనూరలో పర్యటించనుంది సీఎల్పీ బృందం. అక్కడి రైతులతో వారి సమస్యలపై, కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చిస్తారు. రాత్రికి కడెం చేరుకుని పార్టీ కార్యకర్తలతో భేటీ జరిపి బస చేయనున్నారు. 10వ తేదీన కడెం, మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, మంచిర్యాలలో రైతులతో భేటీ అవుతారు. 11న మంచిర్యాల జిల్లా రామగుండెం, కాళే‌శ‌్వరం ప్రాంతాల్లో పర్యటించనుంది సీఎల్పీ బృందం.

ఇక 12న ఉదయం కాళే‌శ్వరం ఆలయంలో దర్శనం చేసుకుని పెద్దపల్లి ఆ తర్వాత జగిత్యాల జిల్లా ధర్మపురికి చేరుకుంటారు కాంగ్రెస్ నేతలు. రాత్రి ధర్మపురిలో బస చేసి 13న జగిత్యాల చేరుకోనున్నారు. జగిత్యాల నుంచి కోరుట్ల, నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో పర్యటిస్తారు. 14న బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బాన్సువాడలో రైతులను కలుస్తారు. 15న నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, వికారాబాద్‌లో పర్యటించి హైదరాబాద్ చేరుకుంటారు. 16న హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తారు.

ఈ పది రోజుల పర్యటన తర్వాత కల్వకుర్తి నుండి ఖమ్మం వరకు రెండో ఫేస్ యాత్రకు సీఎల్పీ బృందం సిద్దమవుతోంది. త్వరలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ నియోజికవర్గాన్ని కూడా యాత్రలో కవర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు సీఎల్పీ నేత భట్టి. ఈ రెండు దఫాల పర్యటనల తర్వాత శీతాకాల అసెంబ్లీ సమావేశాల నాటికి రైతు సమస్యలపై కాంగ్రెస్ వ్యూహాలు కూడా సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవల కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎల్పీ జరిపిన దీక్షకు ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో యాత్రకు ఎంత మంది హాజరవుతారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News