తీరని సింగరేణి భూ నిర్వాసితుల కష్టాలు

Update: 2020-10-06 11:00 GMT

తెలంగాణాలో కీలక పరిశ్రమగా ఉన్న సింగరేణి యాజమాన్యం భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించడంలో చూపుతున్న నిర్లక్ష్యం వందల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న పదిహేడు ఓపెన్ కాస్టు గనుల విస్తరణ నేపథ్యంలో భూములు కోల్పోయిన 532 గిరిజన కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చక పోవడంతో బాధిత కుటుంబాలు నిరాశకు గురవుతున్నాయి. జీఓ నెంబర్ 34 ద్వారా తమను ఆదుకోవాలని సింగరేణి నిర్వాసితులు వేడుకుంటున్నారు.

మరోవైపు ఓపెన్ కాస్టుల నిర్వహణలో సర్వం కోల్పోయిన నిర్వాసిత గిరిజనులకు జీఓ నెంబర్ 34 ద్వారా కుటుంబానికో ఉద్యోగం కల్పించాలని న్యాయస్థానాలు ఆదేశించినా అమలుకు మాత్రం నోచుకోలేదు. జనాభా దామాషా ప్రకారం ఆరుశాతం గిరిజనులకు కేటాయించాల్సిన 665 బ్యాక్ లాగ్ పోస్టులకు, నిర్వాసిత నిరుద్యోగులకు ముడిపెట్టి గిరిజనులను ముప్పుతిప్పలు పెట్టిన యాజమాన్యం ప్రస్తుతం షెడ్యుల్, నాన్ షెడ్యూల్ ప్రాంతాల వాదనను తెరమీదకు తీసుకొచ్చి గిరిజన నిర్వాసితుల జీవితాలతో చెలగాటమాడుతోందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణలో భూములు కోల్పోయిన గిరిజనులను సింగరేణి యాజమాన్యం పీడీఎఫ్ గా గుర్తించింది. అయితే ఆనాటి సింగరేణి సీఎండీగా ఉన్నసుథీర్థభట్టాచార్య 2013లో నిర్వహించిన బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ట్రైబల్ ఎంపవర్మెంట్ పాలసీ ప్రకారం ఆవాసం కోల్పోయిన ప్రతి గిరిజన కుటుంబానికి జీవో నెం. 34 ద్వారా ఉద్యోగమివ్వాలని అదనంగా ఆరుశాతం ఖాళీలను గిరిజనులతోనే భర్తీచేయాలని నిర్ణయించింది. అయితే తదనంతరం ఆయన కోల్ ఇండియా చైర్మన్ గా వెళ్లడంతో గిరిజనుల సంక్షేమ హామీ అటకెక్కింది.

సింగరేణి నిర్ణయంతో ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురుచూసిన నిర్వాసితులు యాజమాన్యం అసమర్థవైఖరితో నానాఅవస్థలూ పడుతున్నారు. నాన్ షెడ్యూల్ ప్రాంత నిర్వాసిత గిరిజన కుటుంబాలకు జీవో నెం. 34 వర్తించదని యాజమాన్యం తెర పైకి తెచ్చిన తిరఖాసుపై ఇల్లందు, వకీల్ పల్లి, భూపాలపల్లి ఏరియా పరిధిలోని గిరిజన నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బాధితులకు న్యాయం చేయాలని, సింగరేణి బొగ్గు గనుల తవ్వకాల కారణంగా నిర్వాసితులైన గిరిజనుల్లో ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని జాతీయ గిరిజన కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.

Full View


Tags:    

Similar News