కట్టడాలు చరిత్రకు సజీవ సాక్ష్యాలు అప్పటి కళా వైభవానికి నిలువుటద్దాలు. అలనాటి పాలకుల దర్పానికి ఆనవాళ్లు.. అలాంటి కట్టడాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కొన్నాయితే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా రాజంపేటలోనూ పూర్వకాలం నాటి అమృత గుండం ధీనస్థితికి చేరుకుంది. చెత్తాచెదారం, పెద్ద పెద్ద వృక్షాలతో పాడుబడ్డ బావిని తలపించేది. కానీ ఇప్పుడు అద్భుత గుండంగా దర్శనమిస్తోంది. పూర్వ వైభవంతో కళకళలాడుతోంది. ఇంతకీ ఆ మెట్ల బావికి పూర్వవైభవం ఎలా వచ్చింది.? ఇంతటి మహా కార్యానికి ఎవరూ పూనుకున్నారు.
ఈ మెట్ల బావి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజంపేటలో ఉంది. శతాబ్ధాల క్రితం నిర్మించిన మెట్లబావి శిథిలావస్థకు చేరుకుంది. బావి చుట్టూ చెట్లు ఏపుగా పెరిగాయి. అక్కడ బావి ఉన్నట్లు ఆనవాళ్లే లేకండా పోయాయి.
కాకతీయుల కాలంలో రాణి శంకరమ్మ రాజంపేటలో శ్రీరాజరాజేశ్వరాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం అచ్చం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్నిపోలి ఉంటుంది. మత సామరస్యానికి గుర్తుగా దర్గాను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆలయానికి వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి మెట్ల బావిని నిర్మించారు.
ఒకప్పుడు రాజంపేట వాసులకు తాగు నీటిని అందించిన మెట్ల బావి క్రమంగా కనుమరుగవుతోంది. ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయి. బావి మొత్తం పిచ్చి మొక్కలు , కాగితాలు , ప్లాస్టిక్ వేస్టేజ్ తో నిండిపోయి డంపు యార్డుగా మారింది. అయితే ఏడాది క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే మెట్లబావిని ఆధునికీకరిస్తానని కౌన్సిలర్ నాని వార్డు ప్రజలకు మాటిచ్చారు. ఎన్నికల్లో గెలిచాక బావిని ఆధునీకరించడానికి పట్టణం ప్రగతి కార్యక్రమంలో భాగంగా పది లక్షల రూపాయలు మంజూరీ చేయించాడు. ఇప్పుడు చరిత్రను రక్షించే పనులను చేయిస్తున్నాడు. ఇప్పటికే బావిలోని చెత్తా , చెదారాన్ని పూర్తిగా తొలగించారు . మురికి కూపంగా మారిన బావిని క్లీన్ చేయించారు. మోటార్ల ద్వారా మురుగు నీటిని తొలగించారు. కొత్త నీటిని బావిలోకి నింపుతున్నారు . రాజరాజేశ్వరాలయం దగ్గర ఓ పురాతన మెట్లబావి ఉందన్న విషయాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చారు. బావి చుట్టూ రంగురంగుల లైట్లతో కొత్త అందాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు . ఆలయానికి వచ్చే భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి ఓ అందమైన పార్కును తెస్తున్నారు . బావిలోకి దిగడానికి మూడు వైపులా నిర్మించిన మెట్ల మరమ్మత్తులు చేశారు . బావి చుట్టూ రక్షణ కోసం కంచె నిర్మాణం చేయనున్నారు . వచ్చే శివరాత్రి నాటికి పనులు పూర్తి చేసి రాజంపేట శివాలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మెట్లబావులను పూడ్చకుండా చారిత్రకకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న పురాతన కట్టడాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు స్థానికులు.