ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బ్యాలెట్ ‌!

Hyderabad: తెలంగాణలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ విపరీతంగా పెరిగింది.

Update: 2021-02-28 02:47 GMT

ఇమేజ్ ఫైల్


Hyderabad: తెలంగాణలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ విపరీతంగా పెరిగింది. ఈవీఎంలకు అవకాశమే లేదు. బ్యాలెట్‌ పత్రమే అనివార్యమైంది. బరిలో నిలబడిన అభ్యర్థుల జాబితా ప్రకారం.. బ్యాలెట్‌ పత్రం దినపత్రిక సైజులో ఉండకతప్పదు. దీంతో జంబో బ్యాలెట్‌ బాక్సులను వినియోగించాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌ -రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది

హైదరాబాద్‌ -రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ స్థానానికి 93 మంది అభ్యర్థులు, నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి 71 మంది బరిలో నిలబడ్డారు. దీంతో బ్యాలెట్‌ పత్రం ఎలా ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన పార్టీలకు మొదటి ప్రాధాన్యంతో జాబితాలో పేర్లు పొందుపరిచారు. అయితే వీరితో సహా పెద్ద సంఖ్యలో అభ్యర్థుల పేర్లను బ్యాలెట్‌పై ముద్రించాల్సి రావడంతో దానిని ఎలా తయారు చేయాలన్నదానిపై రిటర్నింగ్‌ అధికారులు ఇంకా నిర్ణయానికి రాలేదు. బ్యాలెట్‌ పత్రం ఎలా ఉండాలి? ఒకే పేజీలోనా? పుస్తకం మాదిరిగానా? ఒక్కో కాలమ్‌లో ఎంత మందికి చోటు కల్పించాలి? అనే దానిపై స్పష్టతనివ్వాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు తెలిసింది.

భారీ సైజులో బ్యాలెట్‌ పత్రం

ఈసీ ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా బ్యాలెట్‌ పత్రాన్ని రూపొందించనున్నారు. భారీ సైజులో బ్యాలెట్‌ పత్రం ఉంటే.. అందుకు అనుగుణంగానే పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సమయం ఎక్కువ తీసుకోనున్నందున పోలింగ్‌ సమయం పెంచడం, ఒకే పోలింగ్‌ కేంద్రంలో ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లు ఏర్పాటు చేయడం వంటివి అవసరమవుతాయి. బ్యాలెట్‌ బాక్సులను కూడా భారీ సైజులో ఉండేవాటిని సమీకరిస్తున్నారు. గతంలోనూ పలు చోట్ల ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసినప్పుడు పెద్ద సైజు బ్యాలెట్‌ బాక్సులనే వినియోగించారు. వాటినే ఈ ఎన్నికలకు వాడనున్నారు.

Tags:    

Similar News