TS Quarantine Rules: అంతర్జాతీయ ప్రయాణీకుల క్వారంటైన్ కు స్వస్తి
TS Quarantine Rules: విదేశీ ప్రయాణీకులకు సంస్థాగత(పెయిడ్) క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను సడలించింది
TS Quarantine Rules: విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులకు సంస్థాగత(పెయిడ్) క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు ఏడు రోజుల పాటు హోటల్ లేదా ప్రభుత్వం సూచించిన ప్రాంతాల్లో క్వారంటైన్ లో ఉండేవారు. ఇకపై వారు నేరుగా ఇళ్లకు వెళ్లిపోవచ్చని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొత్త నిబంధనలను ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధికారికంగా ప్రకటించింది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిత్యం సగటున 32-34వేల మంది ప్రయాణిస్తునానరు. కరోనా రెండో దశ కారణంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులతో పాటు ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం కొన్ని దేశాల నుంచి మాత్రమే సర్వీసులు హైదరాబాద్ కు వస్తున్నాయి. వాటిలో వచ్చే వారు ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని రావాలి. హైదరాబాద్ చేరుకున్నాక విమానాశ్రయంలోనూ పరీక్షలు చేయించుకోవాలి. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వైద్యాధికారుల సలహా మేరకు ఇంట్లో ఉండాలి లేదా ఆసుపత్రిలో చేరాలి.
చాలా మంది ప్రయాణీకులు హైదరాబాద్ కు చేరుకుని... మరో విమానంలో తమ రాష్ట్రానికి వెళ్తుంటారు. వీరు విమానాశ్రయంలో పరీక్ష చేయించుకుని స్వస్థలాలకు వెళ్లవచ్చు. నేరుగా తెలంగాణకు చేరుకునే ప్రయాణీకులు 14 రోజుల పాటు తమ ఆరోగ్యంపై స్వీయ పరిశీలన చేసుకోవాలి. దేశీయ ప్రయాణీకులకు సైతవం క్వారంటైన్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది.