హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ పీఎస్‌ ఎదుట ఉద్రిక్తత

ఘర్షణ విషయమై అక్కడే ఉన్న పోలీసులకు చెప్పగా వారు పట్టించుకోలేదు. అంతేకాదు ఫిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లా బీజేపీ నేత హరీష్‌రెడ్డిపై దాడి చేశారు. దీంతో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది.

Update: 2020-11-30 07:31 GMT

గ్రేటర్‌ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. దాంతో నేతలు ప్రలోబాలకు తెర తీశారు. డబ్బు, మద్యం పంచేందుకు రెడీ అయ్యారు.. గ్రేటర్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారంటూ పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు నెలకొన్నాయి. దీంతో పలుచోట్ల ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కాలనీలో అధికార పార్టీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది.

ఘర్షణ విషయమై అక్కడే ఉన్న పోలీసులకు చెప్పగా వారు పట్టించుకోలేదు. అంతేకాదు ఫిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లా బీజేపీ నేత హరీష్‌రెడ్డిపై దాడి చేశారు. దీంతో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, కేపీహెచ్‌బీ పీఎస్‌కు భారీగా చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అర్ధరాత్రి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన హరీష్‌రెడ్డిని కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. సమాచారం అందుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ ఆస్పత్రికి చేరుకొని హరీష్‌రెడ్డిని పరామర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారంటూ మండిపడ్డారు. హరీష్‌రెడ్డిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News