Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులు అలర్ట్.. ఆ శాఖ నుంచే మొదటి నోటిఫికేషన్..!
Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులు అలర్ట్.. త్వరలో పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ రాబోతుంది.
Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులు అలర్ట్.. త్వరలో పోలీస్ శాఖ నుంచి నోటిఫికేషన్ రాబోతుంది. గత రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటనలకి సంబంధించి కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో వెతికే పనిలో పడ్డారు. అయితే అన్నింటికంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ ముందువరుసలో ఉంది. మొదట నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్దమవుతోంది. అన్ని అనుకూలంగా జరిగితే ఏప్రిల్ మొదటి వారంలో పోలీసుల ఉద్యోగ ప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
దాదాపు పోలీస్ శాఖలో18 వేలకుపైగా ఖాళీలున్నట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం సుమారు 16వేల ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేసిన చరిత్ర డిపార్ట్‌మెంట్‌కి ఉంది. ఇందులో ఎంపికైన అభ్యర్థుల శిక్షణ పూర్తికాగానే మరోసారి భారీగా పోలీసుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. హోంమంత్రి కూడా అదే చెప్పుకొచ్చారు. దీనికి తగ్గట్లుగానే అసెంబ్లీ సాక్షిగా భారీగా కొలువుల భర్తీపై కీలక ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. దీంతో రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి అప్రమత్తమైంది. కొత్త జిల్లాలు, జోన్ల వారీగా ఖాళీల వివరాలను సేకరించింది.
వాస్తవానికి ప్రభుత్వం శాఖల వారీగా ప్రకటించిన ఖాళీలను భర్తీ చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఉదాహరణకు విద్యాశాఖను తీసుకుంటే ఇందులోని ఖాళీలను భర్తీ చేయాలంటే మొదట టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పోలీస్ శాఖ విషయంలో అలా కాదు. నేరుగా నియామకాల ప్రక్రియను ప్రారంభించవచ్చు. దీనికి ఎటువంటి ఆంక్షలు ఉండవు. అలాగే గ్రూప్ 2, 3,4 నోటిఫికేషన్లకి కూడా కసరత్తు జరుగుతోంది.