పీవీకి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తాం : సీఎం కేసీఆర్‌

Update: 2020-08-29 05:26 GMT

PV Narasimha Rao: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానంచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. హైదరాబాద్‌లో పీవీ స్మారకాన్ని నిర్మించాలని, నెక్లెస్‌రోడ్‌కు పీవీ జ్ఞానమార్గ్‌గా పేరుపెట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పివి నరసింహారావు తెలంగాణ అస్తిత్వ ప్రతీక. భారత దేశంలో అనేక సంస్కరణలు అమలు చేసిన గొప్ప సంస్కర్త. ప్రపంచం గుర్తించిన మహామనిషి. దేశ ప్రధానిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ. అలాంటి మహోన్నత వ్యక్తి గొప్పతనాన్ని రాష్ట్ర అసెంబ్లీలో చర్చిస్తాం. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పివి గురించి విస్తృత చర్చ చేయాలని నిర్ణయించాం. పివికి భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానం చేస్తాం. అసెంబ్లీలో పివి నరసింహారావు పొట్రేయిట్ (తైల వర్ణ చిత్రం – చిత్తరువు) పెట్టాలని నిర్ణయించాం. భారత పార్లమెంటులో కూడా పివి పొట్రెయిట్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం. హైదరాబాద్ లో పివి నెలకొల్పిన సెంట్రల్ యూనివర్సిటీకి పివి పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

ప్రజలకు కేవలం భూమి మాత్రమే ఉత్పత్తి సాధనం, ఉపాధి మార్గం అయిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహరావు అత్యంత సాహసోపేతంగా భూ సంస్కరణలు అమలు చేశారు. దీని ఫలితంగా నేడు తెలంగాణలో 93 శాతం మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. పేదల చేతికి భూమి వచ్చింది. పివి ప్రధానిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితంగా నేడు ఆర్థికంగా నిలదొక్కుకుంది. అలాంటి గొప్ప వ్యక్తిని అద్భుతమైన పద్ధతుల్లో స్మరించుకోవాలి అని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమలులో ఉన్నందున ఈ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? కరోనా నిబంధనలు సడలించాక పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వాములను చేస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి? అనే విషయాలను విభజించుకుని కార్యాచరణ రూపొందించాలి అని సీఎం కమిటి సభ్యులకు సూచించారు.

సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు

►పీవీ జన్మించిన లక్నేపల్లి, పెరిగిన వంగర గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక

►హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీ మెమోరియల్‌.

►విద్యా, వైజ్ఞానిక సాహితీ రంగాల్లో సేవ చేసిన వారికి పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డుకు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదన, అవార్డుకు సంబంధించిన నగదు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయం.

►అమెరికా, సింగపూర్, దక్షిణాఫ్రికా, మలేషియా, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనెడా తదితర దేశాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాల నిర్వహణకు షెడ్యూలు.

►ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా పనిచేసిన కాలంలో పీవీకి సన్నిహిత సంబంధాల ఉన్న అమెరికా మాజీ అద్యక్షుడు బిల్‌ క్లింటన్, బ్రిటన్‌ మాజీ ప్రధాని జాన్‌ మేజర్‌ తదితరులను శత జయంతి ఉత్సవాలకు ఆహ్వానించాలని నిర్ణయం.

►పీవీ రచనలను తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున ముద్రణ, వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, ప్రసంగాలు, ఇంటర్వ్యూలతో పుస్తకాలు, జీవిత విశేషాలతో కూడిన కాఫీ టేబుల్‌ తయారు.

Tags:    

Similar News