Telangana: తెలంగాణలోని పలు జిల్లాల వార్తలు
Telangana: తెలంగాణాలోని పలు జిల్లాల వారిగా తాజా వార్తలు
Telangana:
నిర్మల్:
భూకబ్జాలపై బీజేపీ, టీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు సిద్ధం కావడంతో నిర్మల్ లో ఉద్రిక్తత నెలకొంది. భూ కబ్జాలపై మంత్రి బహిరంగ చర్చకు రావాలని బిజెపి నాయకులు సవాల్ విసరగా.. టీఆర్ఎస్ నేతలు స్థానిక శివాజీ చౌక్ కు చేరుకున్నారు. అదే సమయానికి బీజేపీ నేతలు వెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
హైదరాబాద్:
హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ అపార్ట్‌మెంట్‌ను అడ్డాగా చేసి పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న హయత్‌నగర్ పోలీసులు.. స్థావరంపై దాడి చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేసి.. 40 వేల 5 వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం జిల్లా:
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో మోరంపూడి గోపాల్ రావు అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. బేతపల్లి రెవిన్యూ పరిధిలో గోపాల్‌రావుకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. రికార్డుల్లో కేవలం ఎకరం 20 గుంటలుగా నమోదు చేశారు. మిగిలిన భూమి వేరే వ్యక్తి పేరుపై ఉండటంతో.. తన పేరుమీదకు మార్చాలని అధికారులను కోరాడు. నాలుగేళ్లుగా రెవెన్యూ, కలెక్టరేట్ ఆఫీస్‌ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు.
వరంగల్ జిల్లా:
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టుల కుటుంబాలను పరామర్శించారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇటీవల మావోయిస్టు నేత హరిభూషణ్ కరోనాతో మరణించగా.. ఆయన కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర వస్తువులు అందజేశారు ఎస్పీ కోటిరెడ్డి. కరోనాతో బాధపడుతున్న హరిభూషణ్ భార్య ఎక్కడ ఉన్నా లొంగిపోవాలన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగలో అజ్ఞాత మావోయిస్టు తల్లిని డీఎస్పీ పరామర్శించారు. 20 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు సుధాకర్ తల్లికి అనారోగ్యం బారిన పడటంతో.. ఆమెకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేశారు. సుధాకర్ లొంగిపోయి తన తల్లిని ఆదుకోవాలని..మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం పునరావాసం కల్పించి ఆదుకుంటుందని తెలిపారు.
మహరాష్ర్టలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. తెలంగాణ-మహారాష్ర్ట నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో బాబ్లీ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదలచేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇరు రాష్ర్టల జల సంఘం అధికారులు మొత్తం 14 గేట్లకు గాను మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. నాలుగు నెలలపాటు ఎత్తి ఉంచనున్నారు. బాబ్లీ పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 1.96 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.75 టీఎంసీ నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తటంతో గోదావరిలోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ఆయకట్టు కింద పంటలకు నీరు అందుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.