నల్ల పోచమ్మ విగ్రహం జాడేది

Update: 2020-08-11 10:14 GMT
ప్రతీకాత్మక చిత్రం

Telangana Secretariat Demolition : తెలంగాణ నూతన సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వుల అనంరతం పాత భవన కూల్చివేత పనులను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే గత నెల ప్రారంభించిన ఈ కూల్చివేత పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. అయితే ఈ కొత్త సచివాలయ డిజైన్‌ను కూడా ప్రభుత్వం ఓకే చేసింది. అంతే కాదు ఈ కొత్త భవనం నిర్మాణానికిగాను త్వరలోనే టెండర్లను పిలిచే అవకాశం కూడా ఉంది. ఇక సచివాలయ కూల్చివేత పనులు జరిగే సమయంలో సచివాయలం సమీపంలో ఉన్న నల్లపోచమ్మ ఆలయం, మసీదులపై కొన్ని శిథిలాలు పడటంతో ఆలయాలు దెబ్బతిన్నాయి. దీంతో ప్రభుత్వం వాటిని కూడా పున:నిర్మించడానికి గాను పూర్తిగా నేలమట్టం చేసారు. అయితే అందరి మొక్కులను తీర్చే నల్లపోచమ్మ గుడిలో ఉన్న విగ్రహం గురించి ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది.

ఆలయంలో ఉండాల్సిన నల్లపోచమ్మ విగ్రహం ఆయలయంలో లేకపోవడంతో అది ఎక్కడుంది? విగ్రహం ఏమయింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమ్మవారికి స్వయంగా పూజలు నిర్వహించే ఆలయ పూజారికి కూడా తెలియదా? ఆలయంలో ఉన్న అమ్మవారికి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారా లేదా? అన్న సందేహాలు కూడా బయటికి వస్తున్నాయి. ఆలయాన్ని కూల్చివేసే సమయంలో నిత్యం పూజార్చనలు చేసే పూజారులకు తెలియకుండానే గజ్వేల్‌కు చెందిన కొంత మంది పూజారులతో పూజలు చేయించారా అనే సందేహాలు వస్తున్నాయి. అంతే కాదు ఆ అమ్మవారి విగ్రహాన్ని స్థానిక పూజారులకు తెలియకుండానే మరో చోటుకు తరలించారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆ విగ్రహం ఎక్కడుందో తెలియదని పూజారులు చెబుతున్నారు. అమ్మవారి విగ్రహాన్ని కదిలించే ముందు పూజాధికాలు చేశారో లేదో అని తెలుపుతున్నారు.

కలశం లేకుండా అమ్మవారి విగ్రహాన్ని భద్రపరచడం శాస్త్రోక్తం కాదని కొంత మంది చెబుతున్నారు. నల్లపోచమ్మ విగ్రహాన్ని ఎక్కడ ఉంచారు. రోజూ పూజలు జరుగుతున్నాయా అనే విషయాలను చెప్పాలని పూజారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నల్ల పోచమ్మ తల్లికి రోజూ పూజలు చేయాలని లేదంటే అరిష్టమని పూజారులు చెబుతున్నారు. సెక్రటేరియట్ సమీప ప్రాంతాల్లోని ఇతర ఆలయాల్లో అమ్మవారి విగ్రహం ఉంచారేమోనని పరిశీలించామని.. కానీ లేదంటున్నారు.

 




Tags:    

Similar News