ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలపై తెలంగాణ సర్కారు దృష్టి.. కొత్త అప్పులు పుట్టక...
TS News: ప్రభుత్వ భూములు అమ్మి ఖజానా నింపుకోవాలన్న ఆలోచన...
TS News: రాష్ట్రంలో పథకాలు అమలుకు ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై కేసీఆర్ సర్కారు దృష్టి పెట్టింది.ఇప్పటికే ప్రభుత్వం సెస్‌ల పేరుతో ఆర్టీసీ చార్జీల పెంచింది. దాంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల ధరల వాల్యూ పెంపు, లిక్కర్ ధరలు పెంపు, కరెంట్ చార్జీలు పెంపు ఇలా ఉన్న ఒక్కొక్క ఆప్షన్ ను వినియోగించుకుంటోంది కేసీఆర్ సర్కారు. మరోవైపు పరిమితులకు మించి అప్పులు చేయడంతో బయట అప్పులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వం మళ్ళీ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది.
భూముల అమ్మకంపై మరో సారి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ భూమి అమ్మి ఖజానా నింపుకోవాలని చూస్తుంది. సర్కార్ భూముల అమ్మకం ద్వారా భారీగా ఆదాయం వస్తుందన్న ఆలోచనాలో ఉంది. ఇప్పటికే నగరంలో విలువైన భూములను అమ్మడం ద్వారా ఖజానా నింపుకున్న ప్రభుత్వం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో ఉన్న భూములను అమ్మడానికి సిద్ధం అయింది. రాష్ట్రంలో ఉన్న విలువైన సర్కార్ భూములను అమ్మి... ఆదాయాన్ని రాబట్టాలనుకుంటోంది.
ఇప్పటికే నగరంలోని పలు చోట్ల భూములను అమ్మిన ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. వీటితో పాటు పది జిల్లాల్లో భూములు వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో పాటు లే అవుట్లు డెవలప్ చేయడం ద్వారా భారీగా ఆదాయం పొందొచ్చన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లను అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు, ప్లాట్ల విక్రయాల్లో జిల్లాల్లోని రెవెన్యూ, ఇతర విభాగాలకు పూర్తిస్థాయిలో సామర్థ్యం లేకపోవడంతో హెచ్‌ఎండీఏ, టీఎస్ఐఐసీ సంస్థల సేవలను వినియోగించుకొంది.
ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి వరకు దాదాపు 60 వేల కోట్ల పైగా ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కమర్షియల్ టాక్స్, ల్యాండ్ పూలింగ్ ద్వారా ఆదాయం రాబట్టలని భావిస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం 111 జీవోని రద్దు చేసింది.111 జోవో క్రింద 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. వాటిని అమ్మాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. కేంద్ర నుంచి ఎలాంటి సహాయం అందకపోయిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సొంతంగా ఆదాయాన్ని జనరేట్ చేసుకొనే పనిలో పడింది. ఏ శాఖలో ఎలా ఆదాయం రాబట్టలనేదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు కోసం ప్రభుత్వ భూముల అమ్మాల్సి వస్తుంది.