Telangana: ఈటల రాజేందర్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

Telangana: మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌పై ప్రభుత్వం జెట్‌ స్పీడ్‌తో స్పందిస్తుంది. అసైన్డ్‌ భూములను ఆక్రమించారన్న అభియోగాలపై వేగంగా చర్యలు చేపడుతోంది.

Update: 2021-05-04 05:22 GMT

Telangana: ఈటల రాజేందర్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!

Telangana: మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌పై ప్రభుత్వం జెట్‌ స్పీడ్‌తో స్పందిస్తుంది. అసైన్డ్‌ భూములను ఆక్రమించారన్న అభియోగాలపై వేగంగా చర్యలు చేపడుతోంది. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలో భూములు ఆక్రమించారని ఆరోపిస్తూ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. దీనిపై జిల్లా కలెక్టర్‌ హరీష్‌ 24 గంటల్లో నివేదిక ఇవ్వగానే మరో భూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చింది. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట మండలం దేవరయాంజల్‌ గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయ భూముల ఆక్రమణలపై విచారణ కోసం ఐఏఎస్‌ల కమిటీని వేసింది.

ఈటల, ఆయన బినామీలు ఆలయ భూములను కబ్జా చేశారంటూ దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలంటూ ఆదేశించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు ఆధ్వర్యంలోని ఈ కమిటీలో నల్గొండ, మంచిర్యాల, మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమించింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవరయాంజల్‌‌లో సీతారామస్వామి ఆలయానికి మొత్తం 1521 ఎకరాల భూమి ఉన్నట్లు దేవాదాయశాఖ చెబుతోంది. అయితే ఈ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురైనట్లు, వీటికి సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. అనుమతులు లేకుండా ఈ భూముల్లో భారీ నిర్మాణాలు చేపట్టారంటూ పత్రికల్లో కథనాలు తెలిపాయని పేర్కొంది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర దర్యాప్తు కోసం ఐఏఎస్‌ల కమిటీ వేస్తున్నట్లు వెల్లడించింది.

ఐఏఎస్‌ల కమిటీ నియామకం నేపథ్యంలో దేవరయాంజల్‌ భూముల్లో సోమవారం విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. సీతారామస్వామి దేవస్థానం భూములు ఎవరెవరి ఆదీనంలో ఉన్నాయన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ భూముల్లో పలువురు రైతులు గోదాములు నిర్మించుకున్నారు. ఈటల రాజేందర్‌ కూడా ఇందులో 6.20 ఎకరాల భూమి ఉన్నట్లు తేలింది. దీంతో ఈటలకు సంబంధించిన గోదాములను కూడా అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం దేవరయాంజల్‌, తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలోనూ నిర్మాణాలపై రికార్డులను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. గోదాముల నిర్మాణాలు ఎప్పుడు జరిగాయి..? ఎంత మేరకు ట్యాక్స్‌లు చెల్లిస్తున్నారు...? వంటి వివరాలను విజిలెన్స్‌ అధికారులు సేకరించినట్లు సమాచారం.

Tags:    

Similar News