Telangana Politics: పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ?.. కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం
Telangana Politics: దివంగత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల కర్త పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను తానే స్వయంగా చేపట్టి, కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం
Telangana Politics: దివంగత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల కర్త పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాలను తానే స్వయంగా చేపట్టి, కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన తెలంగాణాముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకేస్తున్నట్టు తెలుస్తోంది. పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి, ఆయన గౌరవాన్ని నిలిపేందుకు మరో అడుగు వేయబోతున్నారు.
దివంగత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల కర్త పీవీ నర్సింహారావు కుమార్తె, విద్యా సంస్థల అధినేత సురభి వాణీదేవికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఆగస్టులో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ పదవీ కాలమూ పూర్తవుతోంది. ఈ మూడు స్థానాలూ గవర్నర్ కోటాలోవే. నాయిని, కర్నె ప్రభాకర్‌లను రెన్యువల్ చేయడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. మూడో సీటుకు పార్టీలో పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. అనూహ్యంగా పీవీ కుమార్తెను పార్టీ అధిష్ఠానం తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. తద్వారా, పీవీ సెంటిమెంటుతో కాంగ్రె్‌సను దెబ్బకొట్టి.. ఆ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు టీఆర్‌ఎస్ వేసిన ఎత్తుగడగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రె్‌సను భుజానికెత్తుకుని ఆదుకున్న పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదన్న ఆవేదన పీవీ కుటుంబీకుల్లో ఉంది.
బాబ్రీ మసీదు కూల్చివేత అంశం అయితేనేమి, ఇతరత్రా కారణాల వల్లనైతేనేమి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పీవీని తమ వాడిగా గుర్తించడం లేదు. ఆయనకు ఇవ్వాల్సిన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదు. పీవీ మరణించిన తర్వాత ఏఐసీసీ కార్యాలయం లోపలికి ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్లక పోవడం వంటి పరిణామాలతో తెలుగు ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి మరింత పెరిగింది. తెలంగాణ నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన పీవీ పట్ల తెలంగాణ ప్రజల్లో క్రేజ్ ఉంది. ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని టీఆర్‌ఎస్ భావిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అందుకే, పీవీ శత జయంతికి ఏడాది ముందే చకచకా పావులు కదిపిన అధికార పార్టీ.. ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎంపీ కేకే నేతృత్వంలో కమిటీ వేసి.. అందులో పీవీ కుటుంబ సభ్యులకూ చోటు కల్పించింది. తాజాగా, ఆయన కుమార్తె వాణీదేవికి ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసిందని రాజకీయ వర్గాలు తెలిపాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఈ పరిణామాలను కేసీఆర్ అవకాశంగా వాడుకోనున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పీవీ విషయంలో, తమ విషయంలో అనుసరించిన వైఖరి కారణంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా టీఆర్‌ఎస్ పట్ల సానుకూల దృక్పథాన్నే కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. పీవీ తర్వాత ఆ స్థాయిలో తెలంగాణ నుంచి జాతీయ రాజకీయాల్లో రాణించే సత్తా కేసీఆర్‌కే ఉందన్న అభిప్రాయాన్నీ వారు సన్నిహితుల వద్ద వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు.
పీవీ శత జయంతి రాజకీయంలో టీఆర్‌ఎస్ పైచేయి సాధించడంతో నష్ట నివారణ కోసం మాజీ మంత్రి గీతారెడ్డి చైర్మన్‌గా, మాజీ ఎంపీ వీహెచ్ గౌరవాధ్యక్షునిగా టీపీసీసీ హడావుడిగా పీవీ శత జయంతి ఉత్సవ కమిటీని వేసింది. ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. ఈనెల 24న ఇందిరా భవన్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు పీవీ కుమారుడు ప్రభాకర్‌రావు, కుమార్తె వాణీదేవి ఇళ్లకు వెళ్లిన టీపీసీసీ బృందానికి ఒకింత చేదు అనుభవమే ఎదురైంది. మాజీ ప్రధాని మాత్రమే కాకుండా ఏఐసీసీ అధ్యక్షునిగానూ పనిచేసిన పీవీ శత జయంతిని ఏఐసీసీ స్థాయిలో నిర్వహించాలి కదా అని ప్రభాకర్‌రావు ప్రశ్నించారు.
కరోనా తర్వాతనైనా ఏఐసీసీ స్థాయిలో అన్ని పార్టీల వారినీ పిలిచి నిర్వహిస్తే వస్తామని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. వాణీదేవి కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు చెబుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీకి పీవీ గుర్తుకు వచ్చారా? అని ఆమె ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే, పీవీ ఇప్పటికి గుర్తుకు వచ్చారా? అంటూ ఆయన కుటుంబ సభ్యులు నిలదీయడాన్ని వీహెచ్ వంటి నాయకులు తప్పు పడుతున్నారు. పీవీని ప్రధానిని చేసిందీ.. ఏఐసీసీ అధ్యక్ష స్థానంలో కూర్చోపెట్టిందీ సోనియానే అని ఇటీవల జరిగిన కమిటీ సమావేశంలో వీహెచ్ పేర్కొన్నారు.