Telangana MLC Elections 2021: ఎమ్మెల్సీ ఎన్నికలు- టెన్షన్ లో టిఆర్ ఎస్
Telangana MLC Elections 2021: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ను టెన్షన్ పెట్టిస్తున్నాయి.
Telangana MLC elections 2021: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ను టెన్షన్ పెట్టిస్తున్నాయి. చెప్పాలంటే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి సరైన ఫలితాలు రాకపోవడం.. ఆ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఫలితాలు పార్టీ భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ కోట ఓటర్లు ప్రభుత్వంపై వ్యతిరేకతో ఉన్నారన్న భావనతో ఎప్పుడు లేనంతగా దృష్టి పెట్టారు నేతలు. ప్రైవేట్ ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, సీనియర్ సిటిజన్స్.. ఇలా పలు సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. తమకు ఎందుకు ఓటు వేయాలో కూడ వివరించారు.
కేటీఆర్, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు...
ఇదిలా ఉండగా.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా కారు పార్టీ నేతలంతా సంఘటిత ఓట్ల టార్గెట్‌గా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. చెప్పాలంటే మంథనిలో న్యాయవాది దంపతుల మర్డర్ తర్వాత ప్రభుత్వం స్పందించలేదని ఆయన సామాజిక వర్గం బ్రహ్మణులు, అడ్వకేట్లు హర్ట్ అయ్యారు. ఇవన్నీ గమనించి అడ్వకేట్లు, బ్రహ్మణ సంఘాలతో టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే జరిగిన పరిణాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయా వర్గాలు.. సంఘాల నేతల మాటలు వింటారా..? లేదా అన్న చర్చ టీఆర్ఎస్‌లో అంతర్గతంగా వినిపిస్తోంది.
కరోనా సమయంలో ప్రభుత్వం పట్టించుకోలేదని..
మరోవైపు.. ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించిన కేటీఆర్ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. అయితే కరోనా సమయంలో ప్రభుత్వం తమను పట్టించుకోలేదని టీచర్లు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న ఈ వర్గం.. ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తుందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీ ఇవ్వలేదన్న అసంతృప్తిని గమనించిన ప్రభుత్వం.. ఎన్జీవో, సెక్రటేరియట్ మిగతా ఉద్యోగుల సంఘాల నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇస్తామని చెప్పారు.
పీఆర్సీ ప్రకటనపై ప్రభుత్వ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు...
చెప్పాలంటే.. సీఎం కేసీఆర్ చేసిన పీఆర్సీ ప్రకటనపై ప్రభుత్వ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. ఇన్నీ రోజులు పీఆర్సీపై టైం వేస్ట్ చేసి ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పడం ఏంటనే అభిప్రాయం ఉద్యోగుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పీఆర్సీ చర్చలపై ఉద్యోగ సంఘాల నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా ఉద్యోగులు మాత్రం ఎలక్షన్ స్టంట్‌గా భావిస్తున్నారు. దీంతో ఈ వర్గాల నుంచి ఓట్లు వస్తాయా..? రావా అన్న అనుమానం నేతల్లో ఉంది. మరీ ముఖ్యంగా టీచర్లైతే పీఆర్సీయే కాకుండా ఎన్నికల్లో తమకు విధులు నిర్వహించే అవకాశం ఇవ్వకపోవడంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.